Pages

Search This Blog


Friday, April 1, 2011

నటి బి.సరోజాదేవి



దర్శకత్వంలో 'సెంచరీ వీరులు'


దర్శకులే నిర్మాతలయితే..


కలసి నడిస్తే కలిసోచ్చేనా..!?


తెలుగు నిర్మాతలకు పెట్టుబడికి తగిన రాబడి ఉందా...!


అటు రచన ...ఇటు నటన....


పాత టైటిల్స్ పై కొత్త తరం మోజు !


తెలుగు సినిమా వాళ్ళం....తమిళమే మాట్లాడదాం !


సినీ సీమలో సంగీతం - ఘంటసాల అవలోకనం


దర్శకుడు బి.గోపాల్


ఛాయాగ్రాహకుడు, దర్శకుడు ఎస్.గోపాలరెడ్డి


దర్శకుడు ఐ.వి.వి.సత్యన్నారాయణ












మహా నటయోగి 'నాగయ్య'

తెలుగువారి తెరవేల్పు పద్మశ్రీ వుష్పలదడియం నాగయ్య.ముడు దశాబ్దాలపాటు తెలుగు వె౦డితెరకు బ౦గారు వెలుగులు, విలువలు తెచ్చిన మహనటుడు, గాయకుడు,దర్శకుడు,స౦గీత దర్శకుడు,రచయుత,నిర్మాత ఆయన. భారతీయ చలన చిత్ర నటులలో ప్రధమ పంక్తిలో నిలిచిన కళాకారుడు.

పాత తరం వారికి పరిచయం అవసరం లేని పేరు. నేటి తరం వారికి పెద్దగా తెలియని పేరు..
ప్రపంచ నటన ప్రమాణాలను అధిగమించి శిఖారామయానుడైన మహానటుడు పాల్ ముని, మహా నటి గ్రేటాగార్బోల స్థాయికెదిగి “పాల్ ముని అఫ్ ఇండియా” అనే బిరుదు అన్వర్ధ నామమై మిగిలింది.

తెలుగు సినిమా తోలి కధానాయకుడు. సకల కళావల్లభుడు, సంగీత కళాకోవిదుడు, మహానటుడు, రచయుత, గాయకుడు, నిర్మాత, దర్శకుడు, సాటిలేని “తనపోతన మనవేమన” అలనాటి తెలుగువారి తెరవేల్పు పద్మశ్రీ చిత్తూరు వి.నాగయ్య.

“చిత్తూరు నాగయ్య ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు ధరించి చిరస్మరణీయుడయ్యాడు. దక్షిణభారత దేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు. తెలుగు సినిమా నే కాకుండా, తమిళ సినిమాకి కూడా ఒక గౌరవాన్నీ, ప్రతిష్ఠనీ కల్పించిన నటుడు నాగయ్య. కేవలం తన నటనతోనూ, వ్యక్తిత్వంతోను ఆ గౌరవం తీసుకురాగలిగారాయన. సభ్యసమాజంలో సినిమానటులంటే చిన్నచూపు వుండేది – తొలిరోజుల్లో నాటకాల వాళ్లకి వున్నట్టు. ఆ చూపును పెద్ద చూపు చేసి సమదృష్టితో చూడగలిగేలా చేసిన మహనీయుడు చిత్తూరు వి.నాగయ్య. మహారాజుల దగ్గరా, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గరా నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి. ఈ గౌరవ ప్రతిష్ఠలు ఆయనతోనే ఆరంభమయాయని చెప్పడం అతిశయోక్తి అనిపించుకోదు.”

ఆంధ్ర నాటక రంఘస్థలంమీద, తెలుగు తెరమీద ఆయన వెలిగింది గత శతాబ్దంలో – “షష్ఠివత్సర కీర్తిమాన్” అని ఆయనను అభినందించారు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. “నటయోగి నాదయోగి అయిన నాగయ్యగారితో మహాగాయని శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి హీరొయిన్ గా నటించారు “మీరా” చిత్రంలో. ఆయన పట్ల దక్షిణ హిందూ స్థానంలో భగవంతుడనే భావం ప్రబలివుండేది.

1938లో హెచ్.ఎమ్.రెడ్డి చిత్రం గృహలక్ష్మితో నాగయ్య సినీ ప్రస్థానం ప్రారంభమైంది. చిత్తూర్లో పత్రికా విలేకరిగా వుంటూ, నాటకాల్లో నటిస్తూ గ్రామఫోన్ రికార్డులు ఇస్తూ కాలక్షేపం చేస్తున్న నాగయ్యను సినిమారంగం ఆహ్వానించింది. ఆ రోజుల్లో పర్సనాలిటీ ఎలావుందని ఎవరూ చూసేవారు కాదు. 'పాటా పద్యం వచ్చునా - ఓకే!' అన్న రోజులు. రంగస్థలం మీద సంభాషణ చెప్పడంలో కూడా కొత్త విధానాన్ని చూపించారనీ, ఉచ్చారణ స్పష్టంగా వున్నదనీ నాగయ్యను హెచ్.ఎం.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, గృహలక్ష్మి (1938) చిత్రములో నటించడానికి పిలిచారు. అందులో ఈయన ఒక దేశభక్తుడి పాత్ర పోషించాడు. గృహలక్షిలో నాగయ్య పాడిన పాటలు అందర్నీ ఆకట్టుకొని ప్రాచుర్యం పొందాయి. తొలిచిత్రంతోనే చిత్తూరు వి.నాగయ్య మంచి నటుడు అనిపించుకున్నాడు.

1939లో బి.యన్.రెడ్డి వందేమాతరం చిత్రంలో నాగయ్యకు కధానాయకుని పాత్ర లభించింది. అదే చిత్రంలో నాగయ్య సంగీతాన్ని కూడా కూర్చారు. అప్పుడు 'హీరో ఇమేజ్' వుంటుందీ, పోతుందీ అన్న భావన లేనేలేదు. వెంటనే 'సుమంగళి (1940) లో వృద్ధపాత్ర ధరించారాయన. తర్వాతి చిత్రం దేవత (1941) లో హీరోయే. ఈ సినిమాలన్నీ తమిళనాడులో కూడా బాగా నడవడంతో, నాగయ్యకు తమిళ చిత్రాల్లో కుడా మంచి అవకాశాలొచ్చాయి. తమిళభాషను ఆయన క్షుణ్ణంగా నేర్చుకున్నారు. గ్రాంథికభాష కూడా అలవరుచున్నారు. తన పాటలు తానే పాడుతూ 'సిసలైన తెలుగు సినిమా హీరోగా' గొప్ప వెలుగు వెలిగారు నాగయ్య. స్వర్గసీమ (1945) ఒక ఉదాహరణ. భక్త పోతన (1942), త్యాగయ్య (1946), యోగి వేమన (1947) చిత్రాలు నాగయ్య జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆ పాత్రల ప్రభావం ఆయన మీద బాగా పడింది.

1938-1973 మధ్య నాగయ్య 200పైగా తెలుగు, తమిళ సినిమాలలో నటించారు. సుమంగళి, భక్త పోతన, రామదాసు, యోగివేమన, త్యాగయ్య ఆయన నటించిన కొన్ని విశేష చిత్రాలు. అప్పటిలో నాగయ్య అత్యధిక పారితోషికం తీసుకొనే నటుడు. 1948లో తమిళ సినిమా "భక్యదలి " కి నాగయ్యకు లక్ష రూపాయలు పారితోషికం.

నాగయ్య మంచి గాయకుడు, సంగీత దర్శకుడు కూడాను. స్వర్గసీమ సినిమాకు నేపధ్యగాయకునిగా ఘంటసాలను పరిచయం చేశారు. త్యాగయ్య సినిమా చూసి మైసూరు మహారాజా నాగయ్యను 101 బంగారు నాణేలు, ఒక కంఠాభరణంతో సత్కరించారు. తెలుగు సినీరంగంలో మొట్టమొదటి పద్మశ్రీ సత్కారం గ్రహించింది నాగయ్యే. మాన్యులు, సామాన్యులు కూడా నాగయ్యను విపరీతంగా అభిమానించే వారు.

తరువాత భాగ్యలక్ష్మి సినిమాతో చిత్రనిర్మాణంలోకి దిగారు. రామదాసు సినిమాలో ఆయన బాగా నష్టపోయారు. సినిమా నిర్మాణంలోను, దాన ధర్మాల వలన ఆయన ఆస్తి బాగా కరిగిపోయింది.

సినిమా ప్రభావం మంచైనా, చెడైనా ప్రజల మీద వుంటుందంటారు. అది చూస్తూనే వున్నాం, వింటూనే వున్నాం. పోతన, వేమన పాత్రల ప్రభావంతోనే ముమ్మడివరం బాలుడు బాలయోగిగా మారాడన్నది తెలిసిన విషయమే. అప్పుడే బాబూరావు పటేల్ తన 'ఫిల్మిండియా' పత్రికలో 'మనదేశంలోనూ ఒక పాల్ ముని వున్నాడు' అని నాగయ్యను ప్రస్తుతించాడు. తెలుగునటుల్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న తొలినటుడు నాగయ్య. ఆ చిత్రం పక్షిరాజా వారి 'బీదలపాట్లు (50). దక్షిణభారతంలో 'పద్మశ్రీ' పురస్కారం పొందిన తొలినటుడూ నాగయ్యే. 'అదేదో నా ఘనత కాదు. నాకే వచ్చిన ప్రశంస కాదు. ఇదినటులందరిదీ!' అని చెప్పేవారు నాగయ్య ఎవరు కనిపించినా.

ఆయన నటనా ప్రభావంతో ముమ్మడివరం బాలయోగి అవతరించాడు. బెంగుళూరులో శ్రీనివాస అయ్యంగార్ యావదాస్తిని బృంధావనముగా మార్చి నాగయ్యగారికి అంకితం చేసారు. భారత ప్రభుత్వం మొట్టమొదటిసారి ప్రకటించిన పద్మశ్రీలలో తెలుగువాడు నాగయ్య గారు. మద్రాసులోని “వాణి మహల్” నాగయ్యగారి సృష్టి. అది శ్రీ త్యాగబ్రహ్మ గాన సభగా ఆయన ప్రారంభించిన సంస్థ.నటన అంటే ప్రవర్తన అనీ restraint అంటే సంయమనం – అనీ ఆయన ప్రతిపాదన. అలాగే త్యాగయ్యగారిది మనోధర్మ ఆయన సిద్దాంతికరించారు, అలాగే ప్రవర్తించారు, పాడారు. 1935 – 55 మధ్య దశకాలలో మన ఏకైక హీరో! గిరి, రామానుజాచారి వగైరాలు నారాయణరావుతో సహా ఎందరున్నా “హీరో” అంటే నాగయ్యగారే! ఆయనలాగ నవ్వడానికి, నడవడానికి, లైనేయ్యడానికి, లవ్ చెయ్యడానికి, భగ్న ప్రేమికుడిగా కృంగిపోవడానికి, ప్రేమలో నిమగ్నుడై పాటలు పాడుకోవడానికి…. అన్నిటికి మించి మహాభక్తుడై కారణజన్ముడుగా కదలడానికి, మెదలదానికి నాటి యువతకు నాగయ్యగారే గురి, గురుపీటం. పాటలు పాడడంలో ఆయన గాత్ర ధర్మాన్ని అనుసరించి “మిమిక్రి” పాటలు పాడడం ఆనాటి సభాకార్యక్రమాలకు ప్రధాన ఆకర్షణగా ఉండేది.

పోతన చిత్రంలో ఆయన పాడిన “నన్ను విడచి కదలకురా”, “పావనగుణ రామహరే”, వినిపించని సభాస్థలిగాని, పెళ్లిపందిరిగాని ఉండేది కాదు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా నాగయ్యగారి సమ్మోహనశక్తి అటువంటిది. ఇక “హాయిసఖి” వంటి ప్రాణయగీతాలు, “అదిగదిగో గగనసీమ” వంటి భావగీతాలు, “రావే రావే బంగారు పాప” వంటి సంసార గీతాలు, “గృహమే కదా స్వర్గసీమ” వంటి ఆర్ద్ర మధుర గీతాలు, “కల్లుమానండోయ్” వంటి ప్రభోద గీతాలు, “బాల బాల నీకు పసుపు కుంకుమ జన్మ హక్కు కాదా బాల” వంటి సంస్కరణాత్మక గీతాలు పాడి, తన బాణీలు జనం చేత పాడించుకున్న “మ్యూజిక్ స్టార్” నాగయ్య గారు. ఇతర సంగీత దర్శకుల బాణీలలో పాడిన నాగయ్యగారి ముద్ర ప్రస్ఫుటంగా కానవచ్చేది. “సంఘం” (ఏ.వి.ఎం) “తాయ్ ఉళ్ళం” (మోడరన్ ధియేటర్స్) – ఆర్.సుదర్శనం, సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పనలో ఆయన పాడిన గీతాలు ప్రత్యేకత కలిగి ఉంటాయి. “జాలిగుండెయేలేదా”, “జాతిభేదం సమసిపోదా” (మా గొపీ, సంఘం) పాటలు రింగుమంటూ వినిపించే ఆయన ఆర్ద్ర హృదయ ధ్వనికి ప్రతిధ్వనులు. నవరస నటనా ధురీణుడైన నాగయ్య భక్తిరసంలో ప్రజా బాహుళ్యాన్ని ముంచి తేల్చి వారి పాలిట అవతార పురుషుడుగా ఎదిగిపోయారు. భక్తి రసగంగలో ప్రేక్షకులు ఓలలాడి భౌతిక వాదానికి, ఐహిక జీవనానికి దూరం పాటించిన సందర్భాలు ఎన్నో! ఆయన నటించిన త్యాగయ్య చూస్తున్న సినిమా హాళ్ళలో కన్నీరు కాలువలు కట్టేదని ప్రతీతి. పోతన, త్యాగయ్య, గోరకుంభార్, రామదాసు పాత్రలలో భక్తినీ, వేమనలో శృంగార వైరాగ్యాలని, బీదలపాట్లు, సంఘం, మా గొపీ, నవజీవనం, గృహలక్ష్మి, నాయిల్లు వగైరా చిత్రాలలో మమతని, మానవత్వాన్ని ప్రతిబింబించే సామాజిక స్పృహతో కూడిన పాత్రలని ఆయన అత్యంత సమర్ధంగా పోషించారు. అలాగే రొమాంటిక్ హీరోగా దేవత, స్వర్గసీమ, భాగ్యలక్ష్మి, వగైరా చిత్రాలు మరపురాని కళాఖండాలు.

నాగయ్యగారు నటుడుగా అందుకున్న అనితర సాధ్యమైన ప్రమాణాలకు “ఫిల్మిండియా” పత్రికా సంపాదకుడు, జ్ఞాని, తత్వవేత్త, విమర్శకుడు శ్రీ బాబురావుపటేల్ ముగ్ధుడై 1945 లో బొంబాయి మరాఠా మందిరలో అఖండ సన్మానం చేసి ఆయనకు “పాల్ ముని అఫ్ ఇండియా” అనే బిరుదును ఇచ్చి గౌరవించారు.అలనాటి సభలో పృథ్విరాజ్ కపూర్ నాగయ్య నటనకు జోహార్లు అర్పించి ఆయన సమకాలికుడనయినందుకు గర్వపడుతున్నానన్నారు. మహామహుల ప్రసంసలందుకున్న మహితాత్ముడు నాగయ్య.

కర్ణాటక సంగీత ప్రపంచంలో తారలుగా ప్రకాశించిన ఎం.కె.త్యాగరాజ భాగవతార్ (సినిహేరో కూడా), మధురై మణి అయ్యర్, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం (సినీనటుడు కూడా), అరియక్కుడి రామానుజ అయ్యంగార్, డి.కె.పట్టమ్మాళ్ వంటి ప్రముఖలు నాగయ్య గారి గానం విని పరవశించి పరమ మిత్రులైపోయారు. పి.యు.చిన్నప్పభాగావతార్ గానపద్దతి ప్రబలంగా ఉన్న తమిళ చిత్ర సంగీత రంగంలో నాగయ్య ప్రభావంతో పెద్దమార్పు వచ్చింది.భావప్రధానమైన సజీవ పాత్రలకు సరిపోయే మనోధర్మ సంగీత మరుద్వీచికలు తమిళ సినీ రంగంలో హాయిగా వీచడానికి నాగయ్యగారే కారకులు. ఆ ప్రభావంతో జి.ఎన్.బి, డి.కె.జయరామన్, వసంతకుమారి వంటి వారు కొత్తరీతిలో గీతికల గానానికి గళాలు విప్పారంటే అతిశయోక్తి కాదు. నాగయ్యగారి అభిమానులుగా మారిన సంగీత ప్రవీణులెందరో తరువాత సంగీత దర్శకులైనారు. సి.ఆర్.సుబ్బరామన్, ఒగిరాల రామచంద్రరావు, అద్దేపల్లి రామారావు, గాలి పెంచల నరసింహారావు ప్రబృతులను వీరిలో ప్రముఖులుగా పేర్కొనవచ్చు. గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య, బాలాంత్రపు రజనీకాంతరావు, చిత్తూరు సుబ్రమణ్య పిళ్ళైగార్ల స్వరకల్పనా రీతులు నాగయ్య గారికి అభిమాన పాత్రమైనవి. “స్వర్గసీమ” వగైరా చిత్రాలలో “ఒహొ హొ పావురమా” వంటి పాటలు అందుకు సాక్షమిస్తాయి. సాహిత్య సంగీత రచనలో సవ్యసాచిగా “రజని” చేసిన బాణిల ప్రభావం ఆ చిత్రాల సంగీతంలో కానవస్తుంది.

మద్రాసు నగరంలో తెలుగువారికి నాగయ్య నీడ చలివెంద్రంలా చల్లగా ఉండేది. రేణుకా పిక్చర్స్ స్థాపించి చిత్ర నిర్మాణంతో పాటు దానధర్మాలకు. ఉచిత భోజనశాల నిర్వహణకు చేతికి ఎముక లేకుండా ఖర్చు చేసేవారు నాగయ్య! తిన్నవారెవరు తిరిగి ఆయన మొహం చూడకుండా సహజమానవ నీతిని నిలబెట్టారు. నెం.11,వ్యాసరావు వీధిలో నాగయ్యగారు చిరకాలం నివసించారు.యోగాశ్రామం ఏర్పాటు చేయాలని వడపళనిలో ఒక తోటకొని అదీ అమ్మివేసారు. తిరువైయారులో శ్రీ త్యాగరాజ స్వామివారి సమాధి వద్ద ఏర్పడిన ఆలయానికి, నిత్యపూజలకు విరాళమిచ్చిన కొద్దిమంది తెలుగువారిలో నాగయ్య ఒకరు. తమిళ సినీ కళాకారులేందరి పేర్లో అక్కడ దాతల జాబితాలో కనిపిస్తాయి. ఒక్క నాగయ్యగారి పేరు చూసి తెలుగువారు ధన్యత చెందుతారు.

భృక్త రహిత తారక రాజయోగ మార్గంలో నాగయ్యగారు కొంతకాలం యోగ సాధన కూడా చేసారు.శారీరక, మానసిక రుగ్మతలను, బాధలను ఆయన ఈ యోగాసాధనలో జయించారు. యోగి పుంగవులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి శిష్యులుగా ఆయన ఆద్యాత్మిక జీవనం గడిపారు. జీవితపు చరమదశలో రంగస్థలం మీద తన అభిమాన పాత్ర భక్తరామదాసు సినిమా తీయాలనే స్థిర సంకల్పంతో కొన్ని సంవత్సరాలపాటు దానిని నిర్మించి రామదాసు వలెనే మరిన్ని ఆర్ధిక చిక్కుల్లో పడి అలమటించారు. ఆ చిత్రం చివరికి విడుదలై ఆయనకీ కీర్తి కిరీటాన్ని సమర్పించింది. అందులో కబీర్ గా గుమ్మడి చేసిన నటనకు నాగయ్యగారు పులకించి పోయేవారు. మహమ్మద్ రఫీ నుంచి ఎందరెందరో నాగయ్యగారి కోసం ఆ సినిమాలో ప్రతిఫలం కోరకుండా తమ విధిని నిర్వహించడం చలన చిత్ర చరిత్రలోనే అపూర్వం.

నాగయ్య గారి భక్త పోతన సినిమా చూసిన ఒక బాలుడు బాలయోగి గా మారిపోయడట!! ఒక మనిషిని యోగిగా ఒక సినిమా మార్చగలిగిందంటే ఆ సినిమా, ఆ నటుల సత్తా ఏమిటో వేరే చెప్పనవసరం లేదు. గుమ్మడి గారు కూడా భక్త పోతన వేషం వేశారు కానీ అది ప్రజాదరణ పొందలేదు. ఒకసారి గుమ్మడి గారు నాగయ్య గారి తో బాలయోగిని తిరిగి మామూలు మనిషిగా మార్చడానికి నా భక్త పోతన చూపిస్తే చాలు అన్నారట. దానికి నాగయ్య గారు మీ మనసులోని ఆవేదనను అర్థం చేసుకోగలను నాకు నిర్మించే స్థోమత ఉండుంటే ఖచ్చితంగా మీతో మరో మారు ఆ సినిమా నిర్మించేవాడిని అన్నారట. ఇలాంటి మహా మనీషి ఔదార్యం వర్ణించడానికి మాటలు చాలవు!!

తారగా ఒకవెలుగు వెలిగినా నయా పైసా కూడా వెనుక వేసుకోలేక పోయారు శ్రీ నాగయ్య.. జీవిత చరమాంకం లో వచ్చిన ప్రతీ వేషాన్ని వేశారు కాదు కాదు వేయాల్సివచ్చింది. అలాంటి రోజులలో ఒకానొక కౌబాయ్ సినిమాలో సైడ్ రోల్ వేస్తున్నారట శ్రీ నాగయ్య గారు. షూటింగ్ సమయం లో ఆయన్ను గుర్తు పట్టిన ఒక పాత మిత్రుడు ఆయన పరిస్థితికి బాధపడితే ఆయన్ను ఓదార్చుతూ “ఉదర నిమిత్తం బహు కృత వేషన్ ” అన్నారట శ్రీ నాగయ్య.

ఆయన మాటతీరూ, చిరునవ్వూ అన్నీ శాంతం ఉట్టిపడుతూ వుండేవి. ఎవరి మీదా ఈర్ష్యాద్వేషాలూ, కోపతాపాలూ వుండేవి కావు. పోతన – తన దగ్గర లేకపోయినా, ఉన్నదేదో దానం చేసినట్టు, – నాగయ్య కూడా దానాలు చేసి చేసి, ఆస్తులన్నీ హరింప జేశారు. కొందర్ని నమ్మి కొంత డబ్బు మోసపోయారు. ‘త్యాగయ్య తీస్తున్నప్పుడు వారి రేణుకా ఆఫీసు ధర్మసత్రంలా వుండేదని చెప్పుకుంటారు. చిన్న చిన్న వేషాలు వేసేవాళ్లూ, చిన్న టెక్నీషియన్లూ, అక్కడే బసా, భోజనాలూ! ‘పొట్టిప్లీడరు (1966) సినిమా తీస్తున్నప్పుడు పద్మనాభం ఆయనతో మాటల సందర్భంగా చెప్పారు తను కూడా ‘రేణుక’ ఆఫీసులో కొంతకాలం వున్నానని. దానికాయన ఎంతో స్పందించి, ‘అలాగా నాయనా! నీకు అప్పుడు ఏ లోపం జరగలేదు గదా, నువ్వెవరో నాకు తెలియకపోయెనే!’ అని బాధపడ్డారు. అవుట్ డోర్ షూటింగులకి వెళ్తే, మధ్యాహ్నం భోజనసమయంలో షూటింగు చూడవచ్చిన జనానికి భోజనం పెట్టమనేవారు నాగయ్య. ‘వాళ్లు కూడా పొద్దున నుంచి మనతోపాటే ఇక్కడ వున్నారుగదా!’ అన్నది ఆయన సమాధానం. మద్రాసులో స్కూళ్లూ, కాలేజీలూ తెరిచే రోజుల్లో ఆయన ఇంటిముందు విపరీతంగా జనం గుమిగూడేవారు – ఆయన లేఖలురాసి ఇస్తే కాలేజీ, హైస్కూళ్లలో సీట్లు దొరకడం సులభయయేది.

తెలుగు సినీరంగములో ఒకదశలో అత్యధిక పారితోషికం తీసుకున్న నాగయ్య, ఆ తరువాత దశలో ఉదరపోషణకు చిన్న వేషాలు వేస్తూ అల్ప పారితోషికాలూ అందుకున్నారు. నా జీవితం అందరికీ ఒక పాఠం. తనకు మాలిన ధర్మం చెయ్యకండి. అపాత్రదానాలు చెయ్యకండి. ఎందరో గోముఖవ్యాఘ్రాలు వుంటారు. అందర్నీ నమ్మకండి! అని చెప్పేవారు - ఇళ్లు అన్నీ పోయి అద్దె ఇంట్లో వున్నప్పుడు! మద్రాసు పానగల్ పార్కులోని ఆయన విగ్రహం, వాణీ మహాల్ ఆడిటోరియం, ఆయన చలనచిత్ర ఉదాత్తపాత్రలూ ఆయన ఘనతను మనకు అనునిత్యం గుర్తుకు తెస్తూవుంటాయి. ఉన్నంతలో నలుగురికి సహాయం చేసిన శ్రీ నాగయ్య 1973లో స్వర్గస్తులయ్యారు..

స్త్రీ పక్షపాతి దర్శకుడు 'క్రాంతికుమార్'