Search This Blog

Thursday, February 9, 2012

నట శిక్షకుడు 'సత్యానంద్'

 
రంగస్థలం, బుల్లితెర, వెండితెర ... పేరేదైనా ప్రతిదాంట్లో ఆయనకంటూ ఓ మార్క్‌ ఉంది. సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపిస్తున్న అగ్రతారల్లో చాలామందిని ఆయనే మలిచారు. వారిలోని సృజనాత్మకశక్తిని వెలికితీయడమే కాదు, వారిలోని లోపాల్ని సైతం గుర్తించి చక్కదిద్దారు. చిరంజీవితో పరిచయం, పనిచేసిన అనుభవం ఉన్న ఆయన మొట్టమొదటి సారిగా పవన్‌ కళ్యాణ్‌ చేత నటనలో ఓనమాలు దిద్దించారు. నటుడిగా, కథారచయితగా సినిమారంగంలో పలు పాత్రల్ని పోషించిన సత్యానంద్‌గారు సినీ ప్రపంచానికి 57మందికి పైగా తారల్ని అందించారు. వెండితెర దేవుళ్లుగా మనం భావిస్తున్న వారిలో చాలామంది ఆయన శిష్యులే అయినా ఆయనలో వీసమెత్తు గర్వం ఉండదు. ఇండిస్టీ మొత్తం హైదరాబాద్‌లో ఉన్నా, ఆయన మాత్రం విశాఖపట్నంలో ఉండడాన్నే ఇష్టపడతారు. 'అదేంటి సార్‌' అని అడిగితే
'పుట్టిన ఊరికి ఖ్యాతి రావాలిగా మరి' అంటారు చిరునవ్వుతో....
చిత్రపరిశ్రమ హైద్రాబాద్‌లో ఉంటే మీరు వైజాగ్‌లో ఉండడానికి కారణం?
నా జన్మస్థలం విశాఖపట్నం. అందుకే ఇక్కడ ఉంటున్నాను. వచ్చే కీర్తి విశాఖపట్నానికే దక్కాలిగా. అందుకని.
మధుసూదన రావుగారితోపాటు చాలామంది యాక్టింగ్‌స్కూల్స్‌ని నడుపుతున్నారు కదా? మీ ప్రత్యేకత ఏమైనా ఉందా?
చాలా యాక్టింగ్‌ స్కూల్స్‌ ఉంటే ఉండవచ్చు. మా కంటూ ఓ మార్క్‌ ఉంది కదా. మా విద్యార్థుల్లో అధిక శాతం మంది అంటే 57మందికి పైగా వెండితెరకు పరిచయమయ్యారు. అనేక మంది గుర్తింపు పొందారు. ప్రస్తుతం స్టార్‌డమ్‌ ఉన్న వాళ్లల్లో చాలా మంది మా విద్యార్థులే.
ఈరంగంలోకి మీరు రావడానికి కారణం? అసలు హీరో కావాలనుకునేవారికి వుండాల్సిన లక్షణాలేంటి?
చిరంజీవిగారితో నాకు 'మంచుపల్లకి' సినిమా నేపథ్యంలో పరిచయం ఏర్పడింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నాలో ఆయన ఏ ఏ లక్షణాల్ని గమనించారో గానీ, ట్రైనింగ్‌ కోసం పవన్‌ కళ్యాణ్‌ని నా దగ్గరకు పంపించారు. అలా
ప్రారంభమైంది నా ఇనిస్టిట్యూట్‌ ప్రస్థానం. హీరో అవ్వాలనుకునే వాళ్లకి ముందు ఆసక్తి ఉండాలి. జ్ఞాపకశక్తి, అర్ధం చేసుకోగల సామర్థ్యం ఉండాలి. ఇక అందరికీ తెలిసినట్లు శారీరక దారుఢ్యం కూడా చాలా అవసరం.
మీ షెడ్యూల్‌ ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు కొనసాగుతుంది?
తెల్లవారుజామున 5 గంటలకే నిద్రలేస్తాను. యోగా, జిమ్‌ వంటివి చేస్తుంటాను. ఫిజిక్‌ గురించి విద్యార్థులకు చెప్పేముందు నేను ఫాలో అవ్వాలి కద అందుకే ఇదంతా. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1గంట దాకా, మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా తరగతులు వుంటాయి. ఇప్పటి వరకు నేను సిబ్బందిని పెట్టుకోలేదు. అన్ని పనుల్నీ నేనే దగ్గరుండి చక్కబెట్టుకుంటాను. ది సత్యానంద్‌ యాక్టింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణకు సంబంధించిన అన్ని ఉపకరణాలూ అందుబాటులోనే ఉంటాయి.
మీకు హీరో ఫీచర్లు ఉన్నాయి? మరి మీరెందుకు సినిమాలకు ప్రయత్నించలేదు?
ఇటీవలే గోపీచంద్‌ సినిమాకి సంబంధించి, ఏలేటి చంద్రశేఖర్‌ నన్ను సంప్రదించారు. హీరోయిన్‌ తండ్రి పాత్ర ఉందని ఫొటోలు తీసుకున్నారు. అయితే తండ్రి పాత్రకు సెట్‌ కారు. మీరు హ్యాండ్సమ్‌గా ఉన్నారని చెప్పారు.
ఎంతో మంది యువ హీరోల్ని తయారు చేస్తున్నారు కదా? మరి మీ సంస్థకు సంబంధించి ఎందుకు పబ్లిసిటీ ఇవ్వడం లేదు?
ఇప్పటి వరకు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం రాలేదు. ఇండిస్టీలో అందరికీ నేను తెలుసు. నటనకు సంబంధించి శిక్షణ తీసుకునేందుకు వారంతట వారే నన్ను కాంటాక్ట్‌ అవుతారు. బోర్డు పెట్టి హంగామా చేయడం నాకు నచ్చదు. అలాగని సెలబ్రిటీల పిల్లలకే శిక్షణనిస్తానని కాదు. నా దగ్గరకు వచ్చిన వాళ్లకు శిక్షణనిస్తాను. ఇంకాచెప్పాలంటే నాదంతా మౌత్‌ పబ్లిసిటీనే. అందుకే ఇప్పటి వరకు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం రాలేదు.
మీ అభిమాన శిష్యుడు ఎవరు? ట్రైనింగ్‌ సమయంలో పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు, ప్రభాస్‌, హవీష్‌ల్లో ఏఏ అంశాల్ని గుర్తించారు?
అందరూ.. నాకిష్టమైనవాళ్లే. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. దాన్ని గుర్తించగలిగితే సమస్యకు పరిష్కారం దక్కినట్లే.
పవన్‌ కళ్యాణ్‌ విషయానికి వస్తే అతనికి సిగ్గు, బిడియం ఎక్కువ. మొదట్లో కెమెరా ముందు నటించేందుకు అందరూ ఇబ్బందిగా ఫీలవుతారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ ఆ సమస్య నుండి ట్రైనింగ్‌ సమయంలోనే బైటపడ్డాడు.
మహేష్‌బాబు విషయానికి వస్తే మొదట్లో అతనికి తెలుగు సరిగ్గా రాదు. తెలుగు చదివేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. బట్‌ ఇప్పుడా ప్రాబ్లం లేదు. జల్సా మూవీలో బ్యాక్‌ గ్రౌండ్‌ వాయిస్‌ ఇవ్వడమే కాదు. లేటెస్ట్‌గా బిజినెస్‌మెన్‌లో పాట పాడేందుకు సిద్ధమయ్యాడు.
ఇక ప్రభాస్‌కి స్వతహాగా లేడీస్‌ అంటే భయం. అతని బ్యాచ్‌లో అమ్మాయిలు లేకపోవడంతో భయం అలాగే కొనసాగింది. అయితే నెమ్మదిగా ఆ భయాన్ని వదిలించాను. ట్రైనింగ్‌కి వచ్చేటప్పుడు ప్రభాస్‌ సన్నగా ఉన్నాడు. ఆ తర్వాత మీరే చూస్తున్నారుగా...
హవీష్‌ విషయానికి వస్తే అతను తెలివైన వాడు. ఒక్కసారి చెబితే ఎలాంటి విషయాన్నైనా అర్ధం చేసుకోగలడు.
మీ దగ్గర శిక్షణ తీసుకొనేవారికి మీ పరిచయాలతో ప్లేస్‌మెంట్స్‌ని ఏర్పాటు చేస్తారా?
ప్లేస్‌మెంట్స్‌ విషయంలో నేను మొదట్లో గ్యారంటీ ఇవ్వను. అయితే నన్ను దర్శకులు సంపద్రించినప్పుడు, ఫలానా మూవీకి ఆడిషన్లు జరుగుతున్నాయి. వెళ్లమని అందరికీ సూచిస్తాను. సెలక్ట్‌ చేసుకోవడం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల వంతు.
మీరు ఫలానా పాత్రకి సూటవుతారు. ఈ తరహా పాత్ర బాగా పోషించగలరని హీరోలకు చెప్పడం... వారి లోపాల్ని సరిదిద్దడం వంటివి చేస్తారా?
ఫలానా వ్యక్తికి ఫలానా రోల్‌ ఇవ్వాలా వద్దా అన్నది ఆయా డైరెక్టర్లపై, వచ్చిన అవకాశాలపై ఆధారపడి ఉంటుంది. దాని కనుగుణంగానే వారికి అవకాశాలు వస్తాయి. నా మటుకు నేను నా దగ్గర ట్రైనింగ్‌ తీసుకెళ్లిన ప్రతి విద్యార్థిలో లోపాల్ని గమనిస్తే ఫోన్‌ చేసి చెబుతుంటాను. ఇప్పటికీ అదే పద్ధతి కొనసాగుతోంది.
మాస్‌, క్లాస్‌ సినిమాల్లో నటించేవాళ్లకి పౌరాణిక సినిమాల్లో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి?
మాస్‌, క్లాస్‌ సినిమాలన్నది వారు ఇండిస్టీలో తెచ్చుకున్న ఫేమ్‌ని బట్టి ఉంటుంది. ఈ తరహా సినిమాలకు భాషపై పట్టు అవసరంలేదు. మామూలుగా వస్తే చాలు. అదే పౌరాణిక సినిమాలో పాత్రకి భాషమీద పట్టు చాలా అవసరం.
- వేంపాటి పరిమళ, విజయవాడ డెస్కు.
నేటికీ అదే జోరు...
బాల నటునిగా 67లో రంగప్రవేశం చేసిన సత్యానంద్‌లో నేటికీ అదే ఊపు. అదే జోరు. అఖిల భారత నాటక కళాపరిషత్‌ పోటీల్లో 40సార్లుకుపైగా ఉత్తమ బాలనటునిగా ఎంపికైన ఆయన చిన్నతనంలోనే పలు అవార్డుల్ని కైవసం చేసుకున్నారు. అంతేకాదు రాష్ట్ర అఖిత భారతస్థాయిలో 25సార్లు ఉత్తమ నటుడి అవార్డుల్ని పొందిన ఆయన 1975 నుంచి విశాఖపట్నంలోని థియోటర్‌ గ్రూప్‌ కళా జ్యోత్స్న స్టేజ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ హోదాలో 15నాటకాల్లో, 60 నాటికల్లో నటించి 90సార్లకుపైగా ఉత్తమ నటుని అవార్డుని పొందారు. ప్రజాదరణలో ఉన్న సౌండ్‌ అండ్‌ లైట్‌ ప్రోగ్రామును రూపొందించడంతోపాటు, భారతరత్న ఇందిరమ్మకు దర్శకత్వం వహించారు. బెంగుళూరుకు చెందిన సాంగ్‌ అండ్‌ డ్రామా డివిజన్‌, ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ యాక్షన్‌లను సంయుక్తంగా నిర్వహించి 1987లో 42రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ఈ కార్యక్రమాన్ని తిలకించి సత్యానంద్‌ను ప్రసంశించారు. దీంతోపాటు నాటికలు గంగిరెద్దాట, బొమ్మలాట, రైలుబండిలు కూడా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. పలు రాష్ట్రాల్లో వీటిని ప్రదర్శించిన సత్యానంద్‌ విమర్శకుల నుంచి ప్రశంసల్ని అందుకున్నారు. అందుకు నిదర్శనం 1998లో సౌత్‌ జోన్‌ థియేటర్‌ ఫెస్టివల్‌తోపాటు, జాతీయస్థాయి పోటీల్లో బొమ్మలాట నాటకాన్ని ప్రదర్శించడమే. నెహ్రూ శతాబ్ది నాట్య సామ్రాట్‌తోపాటు, అవుట్‌ స్టాండింగ్‌ యంగ్‌ పర్సన్‌గా అవార్డుల్ని పొందారు. 'బొమ్మలాట' సాంఘిక నాటకానికి 1995లో విశిష్ట పురస్కారాన్ని పొందిన ఆయన, రంగస్థలానికి చేసిన సేవలకు గాను ఎస్‌ స్క్వేర్‌ మేనేజ్‌మెంట్‌ సత్యానంద్‌ను స్వర్ణకంకణంతో సన్మానించింది.

సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి మృతి


అయిదున్నర దశాబ్దాల క్రితం 'సంతానం' (1955) చిత్రం కోసం ఘంటసాల పాడిన 'చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో...' పాట ఇప్పటికీ మనసు దోచే మధుర గీతం. అదే చిత్రం ద్వారా లతా మంగేష్కర్‌ పాడిన తొలి తెలుగు సినీగీతం 'నిదురపోరా తమ్ముడా...' మనసును తడి చేసే మంచి పాట! ఒరియా గాయకుడు రఘునాథ్‌ పాణిగ్రాహి 'ఇలవేలుపు' (1956) చిత్రం కోసం పాడిన 'చల్లని రాజా ఓ చందమామా...' నేటికీ ఓ మధురానుభూతి. 'నర్తనశాల' (1963) చిత్రంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన 'సలలిత రాగ సుధారస సారం...' లాంటి పాటలు తెలుగువారు ఎవరైనా, ఎన్నటికైనా మరిచిపోగలిగేవేనా? మరి, మంగళంపల్లి, లతా మంగేష్కర్‌, రఘునాథ్‌ లాంటి అగ్రశ్రేణి కళాకారులను మొట్టమొదటిగా తెలుగు సినిమాల్లోకి తెచ్చి, ఇలాంటి మధుర గీతాలు పాడించిన సంగీత దర్శకుడు ఎవరో ఎందరికి గుర్తున్నారు? 90 ఏళ్ళ వయస్సులో ఆయన ఇవాళ్టికీ మన మధ్యనే ఉన్నారని ఎందరికి తెలుసు? సంప్రదాయ సంగీతాన్ని ప్రాతిపదికగా చేసుకొని, దక్షిణ భారత సినీ సంగీతంలో సినిమాలోని సన్నివేశానికీ, సాహిత్యానికీ కొత్త సొబగులు చేకూర్చిన ఆ సంగీత దర్శకుడు - సుసర్ల దక్షిణామూర్తి.
తొమ్మిది పదుల పండు వయసులో ఆ సంగీతజ్ఞుడు తన ఆఖరి సంతానమైన అనురాధ ఇంట్లో చెన్నపట్నంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కంటి చూపు పూర్తిగా పోయి, వినికిడి బాగా తగ్గిన ఈ ముదిమి వయస్సులోనూ మనస్సులో మిగిలిన సంగీతాన్ని మర్చిపోలేదు. 1930ల చివరి నుంచి సినీరంగంలో ఉన్న ఆయన ఇవాళ మన మధ్య ఉన్న తెలుగు సినీ సంగీత దర్శకుల్లోకెల్లా సీనియర్‌! ప్రభుత్వం, సినీ పరిశ్రమ మర్చిపోయినా, సంగీతమే తోడుగా శేషజీవితం గడుపుతున్న సుసర్ల దక్షిణామూర్తిని 'ప్రజాశక్తి' కలిసింది. కుమార్తె అనురాధ సాయంతో ఆయనతో ముఖాముఖి జరిపింది. సుసర్ల, వారి కుమార్తె చెప్పిన ఆపాత మధుర జ్ఞాపకాలు కొన్ని...
సుసర్ల దక్షిణామూర్తి గారికి ఆయన తాత గారి పేరే పెట్టారు. తాతగారైన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి సీనియర్‌ సాక్షాత్తూ త్యాగరాజ శిష్యపరంపరకు చెందినవారు. కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన త్యాగరాజు గారి శిష్యులు ఆకుమళ్ళ (మనంబుచావడి) వెంకట సుబ్బయ్య వద్ద దక్షిణామూర్తి సీనియర్‌ శాస్త్రీయ సంగీతం అధ్యయనం చేశారు. ఆ అధ్యయనం తరువాత తిరిగి స్వగ్రామం పెదకళ్ళేపల్లికి వచ్చిన దక్షిణామూర్తి సీనియర్‌ ఎంతో మందికి ఇంట్లోనే భోజనాది వసతులు కల్పించి మరీ, కర్ణాటక సంగీతంలో శిక్షణనిచ్చారు. ఆయన దగ్గర శిక్షణ పొందిన ప్రసిద్ధుల్లో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, (అంధుడైనప్పటికీ, సంగీతం నేర్చుకొని గొప్పవాడైన) సింహాద్రి అప్పలాచార్యులు, రాజనాల వెంకటప్పయ్య, పిచ్చి హరి, వంకమామిడి వీరరాఘవయ్య తదితరులు ఉన్నారు.
సుసర్ల దక్షిణామూర్తి సీనియర్‌ నుంచి ఆయన కుమారుడు సుసర్ల కృష్ణబ్రహ్మశాస్త్రికీ, అనంతరం ఆయన నుంచి ఆయన కుమారుడైన సుసర్ల దక్షిణామూర్తి జూనియర్‌కూ శాస్త్రీయ సంగీతం వాహినిగా ప్రవహించింది. 11 నవంబర్‌ 1921 నాడు కృష్ణాజిల్లా దివిసీమలో దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కిన పెదకళ్ళేపల్లి గ్రామంలో సుసర్ల దక్షిణామూర్తి జూనియర్‌ జన్మించారు. తల్లి పేరు - అన్నపూర్ణ. దక్షిణామూర్తి జూనియర్‌ తన తండ్రి కృష్ణబ్రహ్మ శాస్త్రి వద్దే ఆరో ఏట నుంచి సంగీతం అభ్యసించారు. ఒకపక్క గాత్ర సంగీతంతో పాటు, మరోపక్క వయొలిన్‌ కూడా నేర్చుకున్నారు. మొదట గాత్రంలో, ఆ తరువాత వయొలిన్‌లో దిట్టగా తయారయ్యారు. దక్షిణామూర్తి జూనియర్‌ బడి చదువులు పెద్దగా చదివింది లేదు. ''ఏ ఆరో తరగతి వరకో, ఏడో తరగతి వరకో చదువుకున్నా. అంతే! హిందీ భాష రాయడం, చదవడం, మాట్లాడడం తెలుసు'' అని ఆయన చెప్పారు. ఇటు వయొలిన్‌తో, అటు గాత్రంతో జంత్ర - గాత్ర కచ్చేరీలు చేస్తూ, 13 ఏళ్ళ ప్రాయంలోనే ఎన్నో రాజాస్థానాల్లో ఆయన సంగీత కచ్చేరీలు చేశారు. చల్లపల్లి రాజా గారి దగ్గర, ఏలూరులో, విజయవాడలో - ఇలా చాలా చోట్ల వయొలిన్‌తో కచ్చేరీలు చేశారు. 16వ ఏటనే 'గజారోహణ' గౌరవం అందుకున్నారు. ''విజయవాడలో నా గాత్రం విని ప్రముఖ పండితులు తిరుపతి వేంకట కవులు సంతోషించారు. నా మీద ఏకంగా పద్యమే చెప్పారు'' అని సుసర్ల తెలిపారు.
''మా అమ్మ, నాన్న గారు తెనాలిలో చాలా కాలం కాపురం ఉన్నారు. అక్కడే నేనూ ఉండేవాణ్ణి. ప్రఖ్యాత నటి కాంచనమాలదీ తెనాలే! సంగీతంలో నా విద్వత్తును గుర్తించిన ఆమె, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావు లాంటి సినిమావాళ్ళతో చెబితే, వాళ్ళు వచ్చి నా కచ్చేరీ చూశారు. తెనాలిలో నేను చేసిన కచ్చేరీ చూసిన భీమవరపు నరసింహారావు, 'మద్రాసుకు వస్తావా?' అని అడిగారు. వారి పిలుపు మేరకు నేను మద్రాసు చేరాను. రాజనాల వెంకటప్పయ్య వెంట ఉండి నన్ను మద్రాసుకు తీసుకువెళ్ళారు'' అని దాదాపు 17వ ఏట నుంచి స్వతంత్రంగా బతికిన సుసర్ల తన సినీ జీవిత ఆరంభాన్ని చెప్పుకొచ్చారు. భీమవరపు నరసింహారావు వద్ద చేరి, 1937 నుంచి సహాయకునిగా పనిచేశారు. భీమవరపు సంగీతం అందించిన నవ్యకళా ఫిలిమ్స్‌ వారి 'మీరాబాయి' (1940) చిత్రానికి పనిచేశారు. దక్షిణామూర్తికి అదే తొలి సినీ అనుభవం. ఆ తరువాత ''ఎన్నో సినిమాలకు సంగీత శాఖలో పనిచేస్తూ, వయొలిన్‌ వాయించాను. నేపథ్య గానం కూడా చేశాను'' అని సుసర్ల తెలిపారు.
1938లో 'హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌' (హెచ్‌.ఎం.వి) సంస్థలో హార్మోనిస్టుగా చేరారు. ''తరువాతి రోజుల్లో సంగీత దర్శకులుగా ప్రసిద్ధులైన జంట ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ - రామ్మూర్తిలో ఒకరైన రామ్మూర్తి నాకు సహోద్యోగి. నేను, రామ్మూర్తి హెచ్‌.ఎం.వి.లో వాద్యకళాకారులుగా పనిచేశాం'' అని సుసర్ల చెప్పారు. 1939 ప్రాంతంలో 'ఆకాశవాణి' (ఏ.ఐ.ఆర్‌) - ఢిల్లీలో ప్రవేశించారు. ''ఆకాశవాణిలో నేను 'ఏ' గ్రేడ్‌ ఆర్టిస్టును. మద్రాసు, కలకత్తా, బెల్గామ్‌, పూనా, బొంబాయి, కటక్‌ లాంటి ఎన్నో చోట్ల ఆకాశవాణిలో పనిచేశాను. మద్రాసులో దాదాపు ఓ ఏడాది పాటు పనిచేశాను. నా పనితీరుకు మెచ్చి, ఢిల్లీకి వెళ్ళమని మద్రాసు ఆకాశవాణి కేంద్రం డైరెక్టరే నన్ను ఢిల్లీకి పంపించారు'' అని ఆయన తెలిపారు. దక్షిణ భారత భాషల సంగీత నిర్దేశకుడిగా సుసర్ల ఎన్నో మధుర స్వరాలను ఆకాశవాణి శ్రోతలకు అందించారు. జాతీయ వార్త సంస్థ 'సెంట్రల్‌ న్యూస్‌ ఆర్గనైజేషన్‌'లో సంగీత నిర్దేశకుడిగా సేవలందించారు.
పర్లాకిమిడి రాజా గజపతిదేవ్‌ తీసిన 'నారద నారది' (1946) చిత్రంతో సుసర్ల దక్షిణామూర్తి తొలిసారిగా సంగీత దర్శకత్వం చేపట్టారు. తరువాతి కాలంలో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న సూర్యకాంతం తొలి చిత్రమైన ఈ సినిమాకు ఆయన సంగీత సారథ్యం వహించడమే కాకుండా, చిన్న పాత్ర కూడా ధరించారు. ఆ తరువాత కొల్హాపూర్‌లో నిర్మించిన 'సేతు బంధన్‌' (1946) చిత్రానికీ, పూనాలో నిర్మించిన 'భట్టి విక్రమార్క' చిత్రానికీ సంగీత దర్శకత్వం వహించారు.
వయొలినిస్టుగా అనేక చిత్రాల్లో పనిచేస్తూ వచ్చారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సి.ఆర్‌. సుబ్బురామన్‌ దగ్గర సహాయకుడిగా పలు చిత్రాలకు పనిచేశారు. ''ఆయన దగ్గర కలకత్తాలో ఓ చిత్రానికి సంగీతం చేశాం'' అని సుసర్ల చెప్పారు. 'చెంచులక్ష్మి' (1943), 'రత్నమాల' (1948 జనవరి2 విడుదల), 'స్వప్నసుందరి' (1950), అక్కినేని 'దేవదాసు' (1953) తదితర చిత్రాలకు కూడా ఆయన పనిచేశారు. ''నాన్నగారు వయొలినే కాకుండా హార్మోనియం, అరుదుగా వేణువు కూడా వాయించేవారు'' అని అనురాధ చెప్పుకొచ్చారు.
'సంసారం' (1950) చిత్రంతో సంగీత దర్శకుడిగా సుసర్ల దక్షిణామూర్తి బాగా ప్రాచుర్యం పొందారు. ఆ రోజుల్లోనే ''ప్రముఖ నటి - నిర్మాత లక్ష్మీరాజ్యం నిర్మించిన రెండు, మూడు సినిమాలకు కలకత్తాలో పనిచేశాను'' అని ఆయన చెప్పారు. ఆకాశవాణిలో పనిచేయడం కూడా సంగీత దర్శకుడయ్యాక సుసర్లకు బాగా ఉపయోగపడింది. ''గాయని లతా మంగేష్కర్‌ అప్పట్లో ఢిల్లీ రేడియో స్టేషన్‌లో పాటలు పాడుతుండేది. ఆమె గాత్రంతో, ఆమెతో పరిచయం ఉండడంతో, నేను సినిమా సంగీత దర్శకుడినైన తరువాత ఆమెను పిలిపించాను. ఆమెతో తొలిసారిగా తెలుగు సినిమాలో పాట పాడించాను. 'నిదురపోరా తమ్ముడా...' అనే ఆ అనిసెట్టి సుబ్బారావు రచన ఎంతగా ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే!'' అని ప్రఖ్యాత గాయని లతాజీతో తన పరిచయాన్ని సుసర్ల వివరించారు.
తొలి రోజుల్లో 'సంసారం' (1950)తో నిలదొక్కుకున్న సుసర్ల ఆ తరువాత సంగీతం అందించిన చిత్రాల్లో ముఖ్యమైనవి కొన్ని - 'ఆలీబాబా - నలభై దొంగలు', 'సర్వాధికారి' (1951), 'ఆడజన్మ' (1951), 'దాసి' (1952), 'సంతానం' (1955), 'ఇలవేలుపు' (1956), 'హరిశ్చంద్ర' (1956), 'భలే బావ' (1957), 'శ్రీకృష్ణలీలలు' (1959), 'అన్నపూర్ణ' (1960), 'నర్తనశాల' (1963), 'శ్రీమద్విరాటపర్వం' (1979), 'శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' (1984) మొదలైనవి. నిండైన గాత్రం ఉన్న దక్షిణామూర్తి తొలి రోజుల్లో సినీ నేపథ్య గాయకుడిగా పలు పాటలు పాడారు. 'పరమానందయ్య శిష్యులు' (1950), 'శ్రీలక్ష్మమ్మ కథ' (1950), 'స్త్రీ సాహసం' (1951) మొదలైన చిత్రాలలో ప్రముఖ హీరో అక్కినేని నాగేశ్వరరావుకు ప్లే-బ్యాక్‌ పాడారు. 'సర్వాధికారి' (1951) చిత్రంలో తమిళ హీరో ఎం.జి.ఆర్‌.కు గొంతు అరువిచ్చారు.
అలా సినీ జీవితపు తొలి రోజుల్లో కొన్ని చిత్రాల్లో ప్లే-బ్యాక్‌ కూడా పాడిన సుసర్లకు అప్పట్లో నటన మీద కూడా కొంత ఆసక్తి ఉండేది. ''నటన మీద మీకు ఆసక్తి ఉండేదా?' అని అడిగితే 'ఏం చెప్పను! 'నారద నారది'లో చిన్నవేషం, రాజ్యం పిక్చర్స్‌ 'హరిశ్చంద్ర' చిత్రంలో కాశీ రాజు వేషం వేశాను'' అంటూ ఆయన నవ్వేశారు.
అన్ని భాషల్లోనూ కలిపి 135 దాకా చిత్రాలకు సుసర్ల దక్షిణామూర్తి పని చేశారు. సంగీత దర్శకులు ఎస్‌.పి. కోదండపాణి, ఏ.ఏ. రాజ్‌, శ్యామ్‌ మొదలైనవారు ఈయన వద్ద పనిచేసినవాళ్ళే! అలాగే, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ సైతం సుసర్ల వద్ద హార్మోనిస్టుగా పనిచేశారు. సంగీత దర్శకుడిగా సుసర్ల ప్రధానంగా హార్మోనియమ్‌ మీదే బాణీలు కట్టేవారు. జమునా రాణి, పి. లీల, బెంగుళూరు లత మొదలైన గాయనీమణులకు తొలి అవకాశం ఇచ్చి, పరిచయం చేసింది - సుసర్లే! 'సంతానం' (1955)తో లతా మంగేష్కర్‌నూ, 'ఇలవేలుపు' (1956)తో రఘునాథ్‌ పాణిగ్రాహినీ, 'వచ్చిన కోడలు నచ్చింది' (1959)తో ఎం.ఎల్‌. వసంత కుమారినీ, 'నర్తనశాల' (1963)తో మంగళంపల్లి బాలమురళీకృష్ణనూ సుసర్ల దక్షిణామూర్తి తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేశారు. సుసర్ల స్వరపరచగా, రావు బాలసరస్వతి గానం చేసిన 'నీలవణ్ణ కణ్ణా వాడా నీ వరు ముత్తం తాడా...' (శివాజీ గణేశన్‌, పద్మిని నటించిన ఓ తమిళ చిత్రంలోని పాట) లాంటి తమిళ చిత్ర గీతాలు సైతం ఇవాళ్టికీ అక్కడ పాపులరే!
ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రార్థనా గీతం పాడి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతులమీదగా సన్మానం అందుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన గుర్తింపు తక్కువైనప్పటికీ, వివిధ ప్రైవేటు సాంస్కృతిక, కళా సంస్థలు ఎన్నో సన్మానాలు, సత్కారాలు చేశాయి. బిరుదులు ప్రదానం చేశాయి. 'స్వరశిల్పి', 'సంగీత కళాప్రపూర్ణ', 'సుస్వరాల సుసర్ల', 'స్వరబ్రహ్మ', 'సంగీత కళానిధి', 'సంగీత సమ్రాట్‌', ఎన్టీఆర్‌ పేర్కొన్న 'స్వర సుధానిధి' లాంటి బిరుదులు సుసర్లకు దక్కాయి. విదేశాలలో కూడా కచ్చేరీలు చేసి, తమ సంగీత వైభవాన్ని సుసర్ల చాటుకున్నారు.
కుటుంబ జీవితం సంగతికి వస్తే - దక్షిణామూర్తికి చిన్న వయస్సులోనే పెళ్ళయింది. ''మా అమ్మ, నాన్న గార్ల పెళ్ళి చాలా గమ్మత్తుగా జరిగింది. మా నాన్న గారు నంద్యాలలో కచ్చేరీ చేయడానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఆయనకు భోజనాది వసతులు చూడడం కోసం చిన్న పిల్ల అయిన మా అమ్మ గారిని అక్కడి పెద్దలు నియోగించారట. పద్మశాలీ కుటుంబానికి చెందిన మా అమ్మ గారి ఒద్దిక, ఓర్పు చూసి, మా నాన్నగారు ఇష్టపడ్డారు. చివరకు పూరీలోని జగన్నాథ స్వామి గుడిలో వారిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. అప్పటికి మా నాన్న గారి వయస్సు 17 ఏళ్ళు, మా అమ్మ గారి వయస్సు 15 ఏళ్ళు'' అని ఆ సంగతులను అనురాధ వివరించారు.
అయితే, కొన్నేళ్ళ తరువాత సుసర్ల జీవితం హాయిగా ఏమీ సాగిపోలేదు. ఆరోగ్యం ఆయనను కుంగదీసింది. మధుమేహ వ్యాధి అధికమైంది. దాంతో, ఆయన రెండు కళ్ళకూ రెటీనా డిటాచ్‌మెంట్‌ వచ్చింది. 1960లలో మొదట ఆయన ఎడమ కన్ను దెబ్బతింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఉన్న ఒంటి కన్ను చూపుతోనే కష్టపడి సంగీతం చేస్తూ వచ్చారు. సంగీత దర్శకుడిగా అవకాశాలు తగ్గాక, కుటుంబ పోషణ కోసం అప్పటి ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర పాటల రికార్డింగుల్లో వయొలిన్‌ వాద్య కళాకారుడిగా కూడా పనిచేశారు. 1982 నుంచి 1987 వరకు ఆయన చక్రవర్తి సంగీత బృందంలో వయొలిన్‌ వాయించారు. కానీ, ఆ తరువాత 1987 ప్రాంతంలో సుసర్లకు రెండో కన్ను కూడా దెబ్బతింది. దాంతో దాదాపుగా అంధత్వం ఆవరించింది. అయినా, ఆయన ఇప్పటికీ మనోనేత్రంతో సంగీత లోకాలను దర్శించడం మానలేదు. వయస్సు 90 ఏళ్ళు నిండుతున్నా, ఇవాళ్టికీ కాస్తంత హుషారుగా అనిపిస్తే, ప్రతిభావంతురాలైన భరతనాట్య కళాకారిణి అయిన మనుమరాలు శుభాంజలీ సద్గురుదాస్‌ లాంటి వారు చేతికి వయొలిన్‌ అందించగానే అలవోకగా పాట పాడుతూ, తీగలపై సుస్వర విన్యాసం సాగిస్తారు.
గణనీయమైన సంఖ్యలో ఎన్‌.టి.రామారావు చిత్రాలకు సంగీతం అందించిన సుసర్ల, ''ఎన్టీఆర్‌ నన్ను బాగా చూసుకున్నారు. ఆయన చిత్రాల్లో పనిచేసేందుకు నాకు పదే పదే అవకాశమిచ్చారు'' అని చెప్పారు. ''శాస్త్రీయ సంగీత ప్రధానమైన బాణీలు కట్టాలంటే - అప్పట్లో సాలూరి రాజేశ్వరరావు గారు, నాన్న గారినే ఎక్కువగా అడిగేవారు. అలాంటి చిత్రాలకు నాన్నగారిని ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా పిలిపించి పెట్టుకొనేవారు. ఎన్టీఆర్‌ రూపొందించిన 'శ్రీమద్విరాటపర్వం', 'శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' చిత్రాలకు పనిచేసే నాటికే నాన్నగారికి సరిగ్గా కళ్ళు కనిపించేవి కావు. ఎవరో ఒకరు వచ్చి, నాన్నగారిని రికార్డింగులకు తీసుకువెళ్ళేవారు. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన హార్మోనియమ్‌ ముందు కూర్చొని, బాణీలు కట్టి, గాయకులతో పాడించేవారు'' అని ప్రస్తుతం దగ్గరుండి మరీ సుసర్ల దక్షిణామూర్తి ఆలనా పాలనా చూసుకుంటున్న ఆయన ఆఖరి సంతానం అనురాధ వివరించారు.
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే - సుసర్ల దక్షిణామూర్తి కొన్ని చిత్రాలను నిర్మించారు కూడా! ''నా పేరు మీద 'అనురాధా మూవీస్‌' అనే సంస్థను నెలకొల్పి, రెండు సినిమాలు కూడా తీశారు. అవి - 'మోహినీ రుక్మాంగద', 'రమా సుందరి' అని నాకు గుర్తు. అయితే, తెలియని వ్యవహారం కావడంతో చిత్ర నిర్మాణం వల్ల చాలా నష్టపోయారు'' అని అనురాధ చెప్పుకొచ్చారు.
తొంభై ఏళ్ళ వయసులో, కంటి చూపు లేక పూర్తిగా ఇంటికే పరిమితమైనా, ఇప్పటికీ సుసర్ల దక్షిణామూర్తికి సంగీతమే మానసికంగా ఆసరా. ఈ వయసులో ఆయన ఒంటరిగా కూర్చొని, తనలో తానే ఏవో పాటలు, కీర్తనలు పాడుకుంటూ ఉంటారు. బహుశా ఆ సలలిత రాగ సుధారస సారమే అనేక ఆర్థిక, మానసిక ఇబ్బందుల్లో మధ్య కూడా ఈ వయస్సులోనూ ఆయనను ముందుకు నడిపిస్తోంది. తెలుగు సినీ రంగంలో ప్రస్తుతం ఉన్న అత్యంత సీనియర్‌ సంగీత దర్శకుడైన ఈ సంగీత మూర్తికి ప్రభుత్వం, కళాప్రియులు కూడా అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.