Pages

Search This Blog


Friday, June 22, 2012

మానవుడు - దానవుడు

                                       
అంతవరకూ సాఫ్ట్ హీరోగా మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్న శోభన్‌బాబు నటజీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పి, కొత్త ఇమేజ్ ఏర్పరచి మాస్ ఆడియన్స్‌కి కూడా ఆయన్ని దగ్గర చేసిన చిత్రం 'మానవుడు-దానవుడు'. ఈ సినిమాలో ఆయన పోషించిన జగన్ పాత్ర ప్రభావం పుష్కర కాలం ఉందంటే అతిశయోక్తి కాదు. బస్ కండెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో తను ఈ సినిమాని 14 సార్లు చూశానని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పడం విశేషం. శోభన్‌బాబు శ్రీరామునిగా నటించిన 'సంపూర్ణ రామాయణం' చిత్రం వంద రోజులు పూర్తి చేసుకున్న రోజునే 'మానవుడు-దానవుడు' చిత్రం విడుదల కావడం ఓ విశేషం. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 40 ఏళ్లు అయిన సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి 'చిత్రజ్యోతి'కి చెప్పిన సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే...
ఉషశ్రీ సంస్థ శోభన్‌బాబు హీరోగా నిర్మించిన 'విచిత్ర దాంపత్యం' సినిమాకు నేనే దర్శకుణ్ణి. ఈ సినిమాకి నిర్మాత పి.చిన్నప్పరెడ్డి. ఆయన అన్నయ్య మారెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తుండేవారు. ఆయన సాహిత్యాభిమాని. సినిమాలంటే ఇష్టం. ఉద్యోగ వ్యవహారాలు చూసుకుంటూనే వారాంతపు రోజుల్లో సినిమా నిర్మాణంలో పాల్గొనేవారు. ఓ రోజున తన భార్యగా నటిస్తున్న విజయనిర్మలని శోభన్‌బాబు బెల్టుతో కొట్టే సన్నివేశాన్ని చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాను. భార్యాభర్తల మధ్య ఓ చిన్న విషయంలో ఘర్షణ మొదలై శోభన్‌బాబు ఆమెని కోప్పడటం, విజయనిర్మల ఆయనకి లాజికల్‌గా సమాధానం చెప్పడం.. దాంతో అహం దెబ్బతిని 'ఆడదానివైయుండి మొగుణ్ణే ఎదిరిస్తావా' అని శోభన్‌బాబు కొట్టే సన్నివేశం అది.
ఆ సీన్‌ని శోభన్‌బాబుకి వివరించగానే 'ఏమండీ... నాకు ఇప్పుడిప్పుడే మహిళా ప్రేక్షకుల్లో ఆదరణ ఏర్పడుతోంది. ఇలాంటి తరుణంలో ఈ సీన్‌లో నటిస్తే నాకు ఇబ్బంది కలుగుతుందేమో కాస్త ఆలోచించండి' అని అడిగారాయన. 'నీ భార్యని ఇంతగా కొట్టినందుకు తరువాతి సన్నివేశంలో నువ్వే పశ్చాత్తాపపడతావు. ఆ సీన్‌తో లింక్ ఉంది కనుక నువ్వేమీ ఆలోచించకుండా ఓ విలన్ కొట్టినట్లే ఆమెని కొట్టు' అన్నాను. ఈ సీన్ తీస్తున్నప్పుడే మారెడ్డిగారు సెట్‌లోకి వచ్చారు. 'ఏమిటండీ.. శోభన్‌బాబు సాఫ్ట్ హీరో అనుకున్నాను.. విలన్‌గా కూడా బాగా చేస్తున్నాడే' అన్నారాయన ఆ షాట్ చూసి.
ఆ తరువాత లంచ్ బ్రేక్‌లో శోభన్‌బాబు, విజయనిర్మల, నేను, నిర్మాతలు.. అంతా కలిసి ఒకేచోట కూర్చుని భోజనాలు చేస్తున్నప్పుడు మారెడ్డిగారు మళ్లీ ఇందాకటి ప్రస్తావన తెచ్చి 'నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర శోభన్‌బాబుతో చేయించి, నెక్స్ట్ పిక్చర్ తీద్దాం' అన్నారు. 'సినిమా మొత్తం నెగిటివ్స్ షేడ్స్ ఉంటే కష్టమండి. మంచి, చెడు స్వభావాలు ఒకే వ్యక్తిలో ఉంటే అతనెలా ప్రవర్తిస్తాడన్నది కథగా తయారు చేద్దాం' అన్నాను. 'ఒకే వ్యక్తిలో రెండు స్వభావాలా.. అదెట్లా' అని ఆలోచనలో పడ్డారు మారెడ్డిగారు. మా సంభాషణ అంతటితో ఆగిపోయింది.
ఆంగ్ల నవల ప్రేరణతో
ఆ తరువాత కొన్ని రోజులకు 'విచిత్ర దాంపత్యం' చిత్రం పూర్తి కావడంతో తదుపరి సినిమా కోసం సన్నాహాలు ప్రారంభించారు చిన్నపరెడ్డి సోదరులు. ఒక రోజు మారెడ్డిగారు కలిసి 'మీరు చెప్పిన పాయింట్ మీద ఆలోచించి ఒక లైన్ తయారు చేశాను.. వినండి' అని నాకు వినిపించారు. 'అఖల్ అండ్ జేన్' అనే ఆంగ్ల నవల స్పూర్తితో ఆయన తయారు చేసిన స్టోరీ లైన్ అది. మా అందరికీ నచ్చడంతో పది రోజుల పాటు మారెడ్డిగారు పనిచేసే పాల్వంచలో నేను, చిన్నపరెడ్డి, మోదుకూరి జాన్సన్, ఛాయాగ్రాహకుడు సుఖదేవ్, ఎడిటర్ అంకిరెడ్డి కూర్చుని కథ తయారు చేశాం. ఇందులో మా ఛాయాగ్రాహకుడు సుఖదేవ్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. ఈ సినిమాకి అద్భుతమైన డైలాగులు రాశారు మోదుకూరి జాన్సన్.
జగన్ సన్నివేశాలు ముందు చిత్రీకరించాం
ఈ సినిమాలో డాక్టర్ వేణుగా, రౌడీ జగన్‌గా రెండు విభిన్నమైన పాత్రలను శోభన్‌బాబు పోషించారు. 14వ రీలుకి వచ్చేవరకూ శోభన్‌బాబు ద్విపాత్రాభినయం చేశారనే అనిపిస్తుంది. అయితే ఒకే వ్యక్తి సందర్భానుసారంగా ఇలా రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తాడన్నది పతాక సన్నివేశాల్లో మాత్రమే బయట పెట్టడం ఆ రోజుల్లో చాలా వెరయిటీగా ఫీలయ్యారు ఆడియన్స్. అదే సినిమాకు పేయింగ్ ఎలిమెంట్ అయింది. ఈ సినిమాలో జగన్‌కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ మొదట ప్రారంభించాం.
'నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అన్నారు సరే కానీ ఈ పాత్ర మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందేమిటండీ.. అందంగా ఉన్న నా ముఖాన్ని ఇలా మార్చేశారు. ఆ క్రాఫ్ ఏమిటి, మీసం ఏమిటి' అని సరదాగా సెట్‌లో అంటుండేవారు శోభన్‌బాబు. ఆయనలో ఉన్న సుగుణం ఏమిటంటే.. తీయబోయే సన్నివేశం గురించి అడిగి తెలుసుకునే వారు తప్ప దాని ముందు సీను ఏమిటి, తరువాత సీన్ ఎలా ఉంటుంది అని అడిగేవారు కాదు. పారితోషికం తీసుకున్న తరువాత దర్శకుడు చెప్పినట్లు చేయడం తన ధర్మంగా భావించేవారు.
అలా ముందు జగన్ సీన్లు, తరువాత డాక్టర్ వేణు సన్నివేశాలు చిత్రీకరించాం. తన అక్కకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవాలి. కానీ చేస్తున్నది డాక్టర్ వృత్తి. దెబ్బ తగిలితే ఆ గాయాన్ని కడిగి కట్టుకట్టాలి కానీ తనే ఇతరుల్ని గాయపరచకూడదు. కానీ పగ తీర్చు కోవాలి.. ఎలా? అందుకే దానవుడి అవతారం ఎత్తి జగన్ పేరుతో దుష్టశిక్షణ చేస్తుంటాడు. ఇటువంటి స్ప్లిట్ పర్సనాలిటీ గురించి తరువాతి కాలంలో కొన్ని సినిమాలు వచ్చాయి కానీ 40 ఏళ్ల క్రితమే మేం తీసి చూపించాం.
35 రోజుల్లో పూర్తి
ఆ రోజుల్లో సింగిల్ షెడ్యూల్ షూటింగ్స్ ఉండేవి కావు. శోభన్‌బాబు, హీరోయిన్‌గా నటించిన శారద.. ఇద్దరూ బిజీ ఆర్టిస్టులు. శోభన్‌బాబు నెల్లో ఓ నాలుగు రోజులు మాకు డేట్స్ ఇస్తే, మరో రెండు రోజులు కలుపుకుని మిగిలిన ఆర్టిస్టులతో వర్క్ చేశాం. 1971 అక్టోబర్ 2న షూటింగ్ ప్రారంభించి 5 నెలల్లో పూర్తి చేశాం.
20 రోజుల పాటు పాట తీశాం
ఈ సినిమాలో నారాయణరెడ్డిగారు 'ఎవరు వీరు.. ఎవరు వీరు' అంటూ వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న మహిళల గురించి ఓ అద్భుతమైన పాట రాశారు. ఈ పాటను రోజుకి రెండు మూడు షాట్స్ చొప్పున 20 రోజుల పాటు తీశాం. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే చెన్నయ్‌లోని ప్రసాద్ రికార్డింగ్ థియేటర్‌లో తొలిసారిగా రికార్డ్ చేసిన పాట ఇదే. అశ్వద్ధామ స్వరపరిచిన ఈ పాటను బాలు అద్భుతంగా పాడారు. మరో విషయం ఏమిటంటే నేపథ్యంలో వచ్చే పాట ఇది. 'అదేమిటి సార్.. ఇంత మంచి పాటను నేను పాడకుండా నేపథ్యగీతంలా చిత్రీకరిస్తారా' అని శోభన్‌బాబు అడిగారు. 'ఒక కొత్త స్కీమ్‌లో ఈ పాటను తీస్తున్నాం.
పాట పాడుతూ ఎటువంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తావో, లిప్ మూమెంట్ లేకుండా అటువంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి' అని చెప్పాను. చాలా అద్భుతంగా నటించాడాయన. పాట చిత్రీకరణ పూర్తయ్యాక రష్ చూసి ఆయన చాలా సంతృప్తి చెంది, 'మీరు చెప్పింది నిజమే రెడ్డిగారు.. లిప్ మూమెంట్ లేకుండానే పాట బాగా వచ్చింది' అన్నారు. తమిళంలో ఈ సినిమాని నిర్మించినప్పుడు ఈ పాటలో శివాజీగణేశన్‌గారికి లిప్ మూమెంట్ పెట్టారు. అది అక్కడి ప్రేక్షకులకు రుచించలేదు. ఈ సినిమాలో శోభన్‌బాబుపై చిత్రీకరించిన 'అణువుఅణువున వెలసిన దేవా ... కను వెలుగై మము నడిపించరావా' పాటను కూడా నారాయణరెడ్డిగారు రాశారు. చాలా గొప్ప పాట ఇది.
ఇతర నటీనటులు
ఈ సినిమాలో హీరోయిన్‌గా శారద నటించారు. చిత్రం విజయం సాధించగానే ఆమె హక్కులు కొనుక్కుని మలయాళంలో నిర్మించారు. మధు, శారద జంటగా నటించారు. శోభన్‌బాబు అక్క పాత్రను కృష్ణకుమారి, ఆమెని మోసం చేసిన వ్యక్తిగా సత్యనారాయణ, తల్లిగా మాలతి, జగన్ అసిస్టెంట్‌గా రాజబాబు, పోలీస్ అధికారిగా అతిధి పాత్రలో కృష్ణంరాజు నటించారు. మరో విషయమేమిటంటే ఈ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన మోహనగాంధీ 'కొప్పు చూడు కొప్పందం చూడు' అనే పాటలో జ్యోతిలక్ష్మితో కలిసి నటించారు. అలాగే ఈ నాటి ప్రముఖ దర్శకుడు సాయిప్రకాష్ ఈ సినిమాకి అప్రెంటిస్‌గా పనిచేశాడు. నిర్మాత చిన్నపరెడ్డి, ఏడిద నాగేశ్వరరావు మిత్రులు కావడంతో ఆయన ఈ చిత్రనిర్మాణంలో చురుకుగా పాల్గొడమే కాదు ఓ వేషం కూడా వేశారు.
ఇతర భాషల్లో..
మలయాళంలో శారద ఈ చిత్రాన్ని నిర్మిస్తే, తమిళంలో శివాజీగణేశన్‌గారితో వి.బి.రాజేంద్రప్రసాద్‌గారు తీశారు. హిందీలో డూండీగారి దర్శకత్వంలో వినోద్‌ఖన్నా హీరోగా ఈ సినిమా తయారైంది. అయితే సాఫ్ట్ హీరో శోభన్‌బాబు జగన్ పాత్ర చేయడం తెలుగులో మాకు ప్లస్ అయినట్లుగా ఇతర భాషల్లో ఆ యా హీరోలకున్న ఇమేజ్ వల్ల కాలేదు. శోభన్‌బాబు నటజీవితాన్ని ఓ మలుపు తిప్పడమే కాకుండా, ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించామన్న తృప్తి నాకు, నిర్మాతలకు మిగిల్చింది 'మానవుడు-దానవుడు'.

Thursday, June 21, 2012

ప్రకాష్ రాజ్ నా హీరో

                                                      ప్రకాష్‌రాజ్ నా హీరో: పోనీవర్మ
పోనీ వర్మ. ఈ పేరు చదవగానో ఈవిడెవరో గుర్తుపట్టడం కష్టమే. కాని విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ శ్రీమతి అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేయొచ్చు. దక్షిణాది వాళ్లకు ప్రకాష్‌రాజ్ భార్యగా తెలిసిన ఈవిడ బాలీవుడ్‌లో పేరున్న నృత్య దర్శకురాలు. సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా తీసిన 'డర్టీపిక్చర్' సినిమాలో 'ఊ లా ల.. ఊ లా ల' పాటకు నృత్యదర్శకత్వం వహించింది ఈవిడే. ప్రకాష్ రాజ్ పోనీని పెళ్లి చేసుకునేందుకే తన మొదటి భార్యను వదిలిపెట్టాడని చాలామంది అనుకున్నారు. కాని వాళ్లిద్దరూ విడిపోయిన తరువాతే మేమిద్దరం దగ్గరయ్యాం అంటున్న ఆమె మాటల్లోనే ప్రకాష్ - పోనీల ప్రేమకథ.
"హైదరాబాద్‌లో 2005లో 'పొన్నివేల్సమ్' షూటింగ్ సందర్భంగా ప్రకాష్‌రాజ్‌ను మొదటిసారి కలుసుకున్నాను. అప్పుడు నాకు ఆయన ఎంత ప్రజాదరణ ఉన్న నటుడో తెలియదు. కాని పరిచయం ఏర్పడిన తరువాత ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. అప్పటికే ప్రకాష్ రాజ్, ఆయన భార్య మధ్య విడాకుల గొడవ నడుస్తోంది. ఆయనేమో కొడుకు కోల్పోయిన దుఃఖాన్ని మర్చిపోలేదు. అలాగే నేను అమ్మను కోల్పోయిన బాధలో ఉన్నాను. దగ్గరి మనుషుల్ని కోల్పోతే ఉండే బాధ మా ఇద్దర్నీ మాట్లాడుకునేలా చేసింది.
ఆ తరువాత కరైకుడి అనే ప్రాంతంలో కలిశాం. అప్పుడు నేను 'మాలామాల్ వీక్లీ' కోసం అక్కడికి వెళ్లాను. ప్రకాష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా షూటింగ్‌కోసం అక్కడికి వచ్చారు. ఆ సినిమాకి దర్శకుడు బాలచందర్. దానికి కొరియోగ్రఫీ చేయమని అడిగారు. నేను ఒప్పుకున్నాను. ఆ సినిమాలోని 'పాయ్' అనే పాట చిత్రీకరణ కోసం శ్రీలంక వెళ్లాం. అప్పుడు మా స్నేహం ఇంకా బలపడింది. ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం. ఆ తరువాత ఇద్దరం కలిసి చాలా సినిమాలకు పనిచేశాం. మేమిద్దరం ప్రేమలో పడ్డామనే విషయం తెలిసేది కాదు.
ఆ రోజు వచ్చింది
2007లో వెనిస్‌లో షూటింగ్ కోసం వెళ్లాం. అక్కడ ఉండగా ప్రకాష్ ఎంతో రొమాంటిక్‌గా పూల గుచ్ఛంతో ప్రపోజ్ చేశారు. నేను ఆయన ప్రేమను అంగీకరించానే కాని మా వాళ్లు పెళ్లికి ఒప్పుకుంటారో లేదో అనే భయం మనసులో ఉంది. అందుకే "మా వాళ్లు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాన''ని చెప్పాను. మా ఇద్దరి అనుబంధాన్ని మా కుటుంబం అంగీకరించకపోవడానికి కారణాలు బోలెడు. ఆయన దక్షిణ భారతీయుడు. భార్య నుంచి విడిపోతున్నాడు. ఇద్దరు పిల్లలకు తండ్రి. ఇవన్నీ ఆలోచించి మన పెళ్లిని మా వాళ్లు అంగీకరించరు అని పదేపదే చెప్తుండేదాన్ని. కాని తనకి వాళ్లను ఒప్పించగలననే నమ్మకం ఉంది. "నేను మీ ఇంటికి వచ్చి మీ వాళ్లతో మాట్లాడతాను'' అనేవారు. అయినా కూడా నాకు మనసులో భయంభయంగా ఉండేది. అలాగని ఆయన ప్రేమను వదులుకునే పరిస్థితిలో కూడా నేను లేను.
2009లో విడాకులు మంజూరు అయ్యాయి. ఆ తరువాతే మా ఇంటికి వచ్చి మా నాన్నతో, సోదరుడితో మాట్లాడారు. వాళ్లు అందుకు వెంటనే ఒప్పుకోలేదు. కొంత సమయం పట్టింది. అయినప్పటికీ ఓపికగా వాళ్లని ఒప్పించగలిగారు ప్రకాష్. 2010 ఆగస్టులో మా పెళ్లయ్యింది. పంజాబీ పద్ధతిలో బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. "నీకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే రోజొకటి వస్తుంది చూడు'' అనేవారు నాతో. ఆ మాటలు నిజమయ్యాయి. మా కుటుంబ సభ్యులందరూ ఆయన్ని ఎంతో అభిమానిస్తున్నారు. ఇష్టపడుతున్నారు. ఇది ఆయన వ్యక్తిత్వం వల్లే సాధ్యపడింది. "నిన్ను పెళ్లి చేసుకుంటున్నానంటే, నీ తండ్రి, సోదరుడు...అంతెందుకు మీ కుటుంబం మొత్తాన్ని పెళ్లి చేసుకుంటున్నట్టే'' అనేవారు ప్రకాష్ నాతో.
నా వల్ల విడిపోలేదు
నా వల్ల ప్రకాష్ తన మొదటి భార్యతో విడిపోయారనుకుంటారు. కాని వాళ్లిద్దరి విషయంలో నేను ఎటువంటి తప్పు చేయలేదు. మా పరిచయం అయ్యేనాటికే వాళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. అందుకే ఆ విషయాన్ని నేను పట్టించుకోలేదు. మా పెళ్లికి వచ్చిన వాళ్లందరికీ వాస్తవం తెలుసు. నిజంగానే నా వల్లే వాళ్లిద్దరూ విడిపోయినట్టయితే ఆయన మొదటి భార్య తన ఇద్దరి పిల్లల్ని మా పెళ్లికి ఎందుకు పంపిస్తుంది. అంతేకాకుండా ఆయన కూతుళ్లే తండ్రికి పసుపు రాసి, గోరింటాకు పెట్టి పెళ్లి కొడుకుగా ఎందుకు అలంకరిస్తారు? అమ్మాయిలిద్దరూ సంగీత్ నుంచి రిసెప్షన్ వరకు మా పక్కనే ఉన్నారు. సెలబ్రిటీలు కావడం వల్లే వాళ్ల మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి కొద్దీ చిలవలు పలువలుగా మాట్లాడారు.
అలాగనుకుంటే అమీర్‌ఖాన్ - రీనాలు విడిపోయారు. వాళ్ల మధ్య ఏమి జరిగింది? అమృతా సింగ్ - సైఫ్ అలీఖాన్‌ల మధ్య ఏమి జరిగిందని విడిపోయారు. వాటి గురించి మూడో వ్యక్తికి అనవసరం. జీవితంలో కొన్ని విషయాల్ని లోతుగా ఆలోచించకూడదు. ప్రపంచం మొత్తంలో నేనొక్కదాన్నే విడాకులు తీసుకున్న వ్యక్తిని పెళ్లాడలేదు. అలాగే ఆఖరి దాన్నీ కాదు. కొన్నేళ్లుగా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇకపై జరుగుతాయి కూడా. హేమమాలిని, శ్రీదేవిలు కూడా నాలాగానే పెళ్లిళ్లు చేసుకున్నారు. బయటివాళ్లకు రెండో భార్యపై నిందలు వేయడం చాలా సులభం. ఆయన మాజీ భార్య లలితకు కూడా మా గురించి తెలుసు. కాని ఆమె ఏనాడూ నాకు ఫోన్ చేసి ఒక్క మాటయినా అనలేదు. ఆమె నాతో ఎప్పుడూ "నువ్వు మమ్మల్ని విడగొట్టావు'' అనలేదు. వాళ్లిద్దరూ ఇష్టంతోనే విడాకులు తీసుకున్నారు.
ప్రకాష్ పెద్ద కూతురికి పద్నాలుగేళ్లు. అన్ని విషయాలను అర్థంచేసుకోగలదు. ఆ అమ్మాయితో మా పెళ్లి గురించి మాట్లాడారు ప్రకాష్. పెద్దపాపతో నన్ను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పినప్పుడు ఆ పాప "గో ఎహెడ్ డాడ్'' అనిచెప్పిందట.
ఎప్పుడూ శ్రేయోభిలాషులమే
ప్రతీ మహిళా సెక్యూరిటీ గురించి ఆలోచిస్తుంది. అలాగే లలిత కూడా ఆలోచించింది. ఈ విషయంలో ఆమెని తప్పు పట్టాల్సిన అవసరంలేదు. ఆ కారణం వల్లనే వాళ్ల విడాకులు ఆలస్యం అయ్యాయి. ఈ విషయం గురించి ఇంతకంటే ఎక్కువగా నేను మాట్లాడకూడదు. పొసగలేదు కాబట్టి విడిపోయారంతే. మన చట్టాల ప్రకారం భర్త విడాకులు కోరుకుని భార్య వద్దనుకుంటే 50 యేళ్లయినా ఆమె ఆ కేసును కొనసాగించొచ్చు. భార్య ఒప్పుకునే వరకు విడాకులు మంజూరు అవ్వవు. అందుకే వీళ్ల విషయంలో కూడా ఆలస్యం అయ్యింది. గత రెండు నెలలుగా ఆయన కూతుళ్లు ఇద్దరూ నాతోనే ఉంటున్నారు. మా అత్తగారు కూడా ఎంతో ప్రేమగా ఉంటారు.
ప్రకాష్, లలిత విడిపోయారు కాబట్టి మొహాలు చూసుకోకుండా ఉంటున్నారనుకుంటే పొరపాటు. వాళ్లు ఇప్పటికీ స్నేహితులే. దానివల్ల నాకొచ్చిన ఇబ్బందేమీ లేదు. మా పెళ్లి జరిగిన రోజు లలిత శుభాకాంక్షలు పంపింది. పంజాబీ సంప్రదాయం ప్రకారం పెళ్లి తరువాత నూతన దంపతులు వాళ్ల బంధువులకి, స్నేహితులకి బహుమతులు ఇవ్వాలి. దాని ప్రకారం 'నాకేం బహుమతి పంపుతావ'ని లలిత అడిగింది. ఈ రోజు వరకు కూడా ఆమె నాతో పోట్లాడలేదు, ప్రకాష్‌ను ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడగలేదు. మేము తన శ్రేయోభిలాషులం. ఆమెకి తోడుగా ఎల్లకాలం ఉంటాం. ఒకవేళ ఆమె వివాహం చేసుకుంటే నేను, ప్రకాష్ ముందుండి పెళ్లి పనులు చూసుకుంటాం.
ప్రకాష్‌తో జీవితం
పెళ్లి తరువాత జీవితం చాలా ఆనందంగా ఉంది. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను. జీవితం విలువ, మనుషుల ప్రేమ తెలుస్తున్నాయి. పెళ్లి తరువాత ఆరు నెలల పాటు పనికి బ్రేక్ ఇచ్చాను. నా వ్యక్తిగతానుభవం బట్టి సినిమాల్లో నెగెటివ్ పాత్రలు చేసేవాళ్లు నిజ జీవితంలో చాలా మంచిగా ఉంటారు. అందుకు ప్రకాష్ మంచి ఉదాహరణ. ప్రకాష్‌కి త్వరగా కోపం వస్తుంది. కాని విషయాల్ని బాగా అర్థం చేసుకుంటారు. తను పర్ఫెక్ట్‌గా పనులు చేయాలంటాడు. అందుకూ పూర్తి విరుద్ధం నేను. కాకపోతే అవన్నీ ఒకరినొకరం అర్థం చేసుకుని బాలెన్స్ చేసుకుంటున్నాం. మా ఇద్దరికీ బోలెడు సారూప్యతలు కూడా ఉన్నాయి. తినడం, ప్రయాణాలు చేయడమంటే మా ఇద్దరికీ చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్యా పదకొండేళ్ల గ్యాప్ ఉంది. అది మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే "నీ కోసం నేను ఉన్నాననే'' వ్యక్తి నా జీవితంలోకి రావాలనుకునేదాన్ని. అలాంటి వ్యక్తే దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది.
చెన్నయ్‌లో మా అత్తగారిల్లు లలిత వాళ్ల ఇంటికి దగ్గరగా ఉంటుంది. అందుకని ఆయన చెన్నయ్ వెళ్లినప్పుడల్లా లలిత వాళ్లింటికి వెళ్లాడని వార్తలు పుడుతుంటాయి. కాని 2005 నుంచి వాళ్లిద్దరూ కలిసి ఉండడం లేదు. ప్రకాష్ పెద్దకూతురు కొడైకెనాల్‌లో చదువుతోంది. మా పెళ్లి తరువాత లలితతో కలిసి మేమందరం వెళ్లి పాపను స్కూల్లో దిగబెట్టాం. ఆ పిల్లలు నన్ను సవతి తల్లిలా చూడరు. ఈ మధ్యనే పిల్లలతో కలిసి గోవా వెళ్లాం. మాది మొబైల్ కుటుంబం. ప్రకాష్ అన్ని దక్షిణాది భాషల్లో పనిచేస్తాడు కాబట్టి ముంబయి, హైదరాబాద్, చెన్నయ్, బెంగళూరుల్లో ఇళ్లు ఉన్నాయి. అలా వెళ్లినప్పుడు పిల్లలకి సెలవులు ఉంటే మాతో కలిసి వస్తారు. లలిత తన స్నేహితులతో కలిసి బయట ప్రయాణాలకు వెళ్లినప్పుడు పిల్లలు మాతోనే ఉంటారు. అంతేకాని బాధ్యతలు నేను తీసుకోను అని ఏనాడు లలితతో చెప్పలేదు. ఎందుకంటే ప్రకాష్‌ని పెళ్లి చేసుకున్నప్పుడే పిల్లల్ని కూడా నా పిల్లలు అనుకున్నా.
ఇక కెరీర్ విషయానికి వస్తే ఇండియన్ స్కూల్ ఫర్ పెర్ఫామింగ్ ఆర్ట్స్ (ఇస్పా) పేరుతో ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేశాను. పాఠశాలలకు వెళ్లి ఉచితంగా డ్యాన్స్ క్లాసులు తీసుకుంటున్నాను. సినిమాకి దర్శకత్వం చేయాలని ఉంది. కథ వెతుకుతున్నాను. కథతో పాటు ప్రకాష్ అనుమతి కూడా కావాలి. వచ్చే ఏడాది బిడ్డకు తల్లి కావాలనుకుంటున్నాను. జీవితంలో ఏదైనా చెడు జరిగితే అది మంచి కోసం ఏర్పాటు చేసిన మార్గం అనుకుంటాను నేను.''
(సావీ సౌజన్యంతో)
* మా మేనమామ బాలీవుడ్ నటుడు గోవిందా సోదరిని పెళ్లి చేసుకున్నాడు. అలా గోవిందాకి బంధువు అయ్యాను.
* అమితాబ్‌బచ్చన్, సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్, అక్షయ్‌కుమార్, హృతిక్‌రోషన్, అజయ్‌దేవ్‌గన్, కరీనాకపూర్, దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, బిపాసాబసు, విద్యాబాలన్, కత్రినా కైఫ్, లారా దత్తాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాను.
* దర్శకుడు ప్రియదర్శన్ పరిశ్రమలో నా గాడ్ ఫాదర్. డర్టీ పిక్చర్‌లో చేసిన 'ఊ లా లా' పాటకు మెచ్చుకోళ్లు, అవార్డులు వచ్చాయి.