Pages

Search This Blog


Thursday, August 4, 2011

సంగీత స్వర్ణయుగం {1940 - 1960}

సుమారుగా 1940 నుండి 1960ల పూర్వార్ధపు మధ్యకాలం చిత్రసంగీతానికి స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆ కాలంలో అన్ని భాషలలోనూ ఎన్నో మధురమైన పాటలు వచ్చాయి. సంగీత దర్శకులు, రచయితలు, గాయక గాయనీమణులు శ్రద్ధతో సృష్టించిన అలనాటి ఆ పాటలు మరువరానివి, మరువలేనివి.

హిందీలో అనిల్ బిశ్వాస్, నౌషాద్, సలిల్ చౌదరీ, శంకర్-జైకిషన్, రోషన్, S.D బర్మన్, తెలుగులో రాజేశ్వరరావు, పెండ్యాల, ఘంటసాల, గాలిపెంచల, చలపతిరావు, తమిళములో G. రామనాథన్, విశ్వనాథన్-రామమూర్తి, మహాదేవన్, S.V. వెంకటరామన్, కన్నడములో లింగప్ప, విజయభాస్కర్, రాజన్-నాగేంద్ర, రంగారావు, మలయాళములో దేవరాజన్, బాబురాజ్, V.దక్షిణామూర్తి వంటి ప్రసిద్ధ సంగీత దర్శకులతో చిత్రసంగీతం విలసిల్లిన కాలమది. వారిలో కొందరు గొప్ప గాయకులు కూడా.

అట్టివారిలో ప్రముఖులు ఘంటసాల, పంకజ్ మల్లిక్, హేమంతకుమార్, S.D బర్మన్, సాలూరి, నాగయ్య, ఏ. ఎం. రాజా. ఇంక ముఖ్యంగా తెలుగు నేపథ్య గాయకుల విషయానికి వస్తే తక్కిన భాషల్లో వారికి లేనంతటి వైవిధ్యం ఇక్కడుంది. ఎం.ఎస్. రామారావు, వి.జె.వర్మ, ఘంటసాల, పిఠాపురం, మాధవపెద్ది, ఏ.ఎం. రాజా, పి.బి. శ్రీనివాస్, రఘునాథ్ పాణిగ్రాహి ల కంఠాలలో ఒకరి దానితో మరొకరికి పోలిక లేదు.

ఏ.యం.రాజా (అయిమల మన్మథరాజు రాజా) (1929-1989) 1950వ దశకములో తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. విప్రనారాయణ, చక్రపాణి, ప్రేమలేఖలు, మిస్సమ్మ పాటలు రాజా గాత్ర మాధుర్యానికి కొన్ని మచ్చు తునకలు. ఈయన వివిధ భాషలలో 10,000 పాటలు పాడి, వందకు పైగా సినిమాలకు సంగీతం సమకూర్చాడు.

తమిళంలో సుసర్ల దక్షిణామూర్తి దర్శకత్వంలో సంసారం, సంసారం అనే పాట (తెలుగులో దీనిని ఘంటసాల పాడారు) రాజా పాడిన మొట్టమొదటి సినిమా పాట. తెలుగులో వీరు పాడిన మొదటి పాటలు ‘ఆకలి’ ‘ఆదర్శం’, ‘సంక్రాంతి’ (1952) చిత్రాలలోనివి. కానీ గాయకుడిగా గుర్తింపు పొందింది పక్కింటి అమ్మాయి (1953) సినిమాలో పాడిన పాటలతో.

రాజా గళంలో ఒక వినూత్నమయిన సౌకుమార్యం, మార్దవం, మాధుర్యం ఉంది. తలత్, రఫీల జాడలు అక్కడక్కడ కనబడినా రాజా కంఠస్వరం ప్రత్యేకమైనది. ఎక్కడ వినబడినా గుర్తించడం కష్టం కాదు. కాని అనుకరించడం మాత్రం సులభం కాదు. ఆ ప్రత్యేకత వల్లనే సినిమారంగంలో రాజా మెల్లమెల్లగా పైకెదిగారు. ఆ కాలపు సంగీత దర్శకులందరు శ్రుతి చేసిన పాటలను అన్ని దక్షిణ భారత భాషలలో, హిందీలో పాడసాగారు. లింగప్ప దర్శకత్వంలో కన్నడ చిత్రం ‘స్కూల్‌మాస్టర్’(1958, తరువాత తెలుగులో ‘బడిపంతులు’గా డబ్ చేయబడింది.) లో జమునారాణితో కలసిపాడిన ‘అతిమధుర అనురాగ’ అనే పాట, దేవరాజన్ దర్శకత్వంలోని ‘ఆకాశగంగయుడె కరయిల్’ చెప్పుకోదగ్గవి. సింహళ భాషలో కూడా రాజా పాడారు. హిందీలో బహుత్ దిన్ హుయే (తెలుగులో బాలనాగమ్మ కథ ఆధారంగా; సంగీత దర్శకుడు ఈమని శంకర శాస్త్రి) అనే సినిమాలో కూడా పాడారు.

అన్ని భాషలలో పాడుతున్నా, తెలుగు తమిళ సినిమాలలోనే రాజా ఎక్కువగా పాడేవారు. ఆ సమయంలోనే ఎం. జీ. రామచంద్రన్ నటించిన ‘జెనోవా’ చిత్ర నిర్మాణ సమయంలో పీ. జీ. కృష్ణవేణిని (జిక్కీ గా మనకు చిరపరిచితం ఈమె గాత్రం) చూడడం తటస్థించింది. ఇద్దరూ కలిసి సినిమాలలో యుగళ గీతాలు పాడేవారు. అలా ఆ పరిచయం ప్రేమగా మారింది. కొందరు ఇది ‘ప్రేమలేఖలు’ చిత్రీకరణ సమయంలో జరిగిందంటారు. ఆ ప్రేమ అలా పెరిగి పాటలలోనే కాకుండా జీవితంలో కూడా భాగస్వాములయ్యారు. వారికి నలుగురు ఆడ పిల్లలు, ఇద్దరు కొడుకులు. అందులో ఒకరికి రాజాలా కంఠస్వరం ఉందట. ఇద్దరు కూతుళ్లు కూడా బాగా పాడేవారేనట.

రాజా సంగీత జీవితపు ఆరంభ దశలో అతనికి ఎక్కువ ఖ్యాతిని తెచ్చినవి మూడు చిత్రాలు - ప్రేమలేఖలు(1953; హిందీలో ‘ఆహ్’, తమిళములో ‘అవన్’), అమరసందేశం(హిందీలోని ‘బైజూ బావరా’ ఆధారంగా తీసినది), విప్రనారాయణ(1954). హిందీలో ముఖేశ్ పాడిన పాటలను రాజా తెలుగు, తమిళ భాషల్లో పాడారు. శంకర్ జైకిషన్‌ల దర్శకత్వంలో రికార్డు చేయబడినవి ఈ పాటలు. లతా మంగేష్కర్ పాటలను జిక్కి పాడారు. ‘పాడు జీవితము యౌవనము’, ‘విధి రాకాసి కత్తులు దూసి’, ‘రారాదా మది నిన్నే పిలిచెగాదా’ (జిక్కీతో), ‘నీవెవ్వరవో చిరునవ్వులతో’ (జిక్కీతో) రాజా ఇందులో పాడిన పాటలు. ఈ చిత్రం హిందీలోకంటే తెలుగులో ఎక్కువగా ఆదరణ పొందడానికి కారణం రాజా-జిక్కీ పాటలే. ఆ కాలంలో రేడియో సిలోన్‌లో జనరంజకమైన ఈ పాటలు తరచుగా వస్తుండేవి.

సంగీత ప్రధానమైన ‘అమర సందేశం’లో ముఖ్యంగా చెప్పుకోవలసినవి ఆయన పాడిన రెండు సోలోలు: ‘మధురం మధురం మనోహరం’, ‘ఆనతి కావలెనా గానానికి సమయము రావలెనా’ (దర్బారీ కానడ రాగంలో తెలుగులో వచ్చిన ఒక గొప్ప పాట), రఘునాథ పాణిగ్రాహితో కలిసి పాడిన సంగీత సంవాద గీతం ‘మానస లాలస సంగీతం’.

ఇదే చిత్రంలో శ్రీశ్రీ, ఆరుద్రలిరువురూ తమ రచనగా గొప్పగా చెప్పుకున్న ‘సదసత్కళా’ అనే సీసపద్యం చాలా చక్కనిది. రాజా పాడిన ఈ పద్యం ఒక చిత్రకవిత్వమే. ఇందులో మొదటి పాదం ‘స’తో మొదలయి, ‘స’తో ముగుస్తుంది, రెండవ పాదం ‘రి’తో, మూడవది ‘గ’తో, అలాగే మిగిలినవి.

ఇక రాజ రాజేశ్వరుల అపూర్వ సృష్టే ‘విప్రనారాయణ’. రాజా ఈ చిత్రంలో భానుమతితో పాడారు. ‘విప్రనారాయణ’ లోని పాటలు ఇప్పటికీ ఏమాత్రం వసివాడని కుసుమాలే. రాసలీలను చిత్రించే ‘చూడుమదే చెలియా’ పాటలో ‘…నారి నారి నడుమ మురారి’ అని మంద్రస్వరంలో రాజా పాడుతుంటే కలిగే అనుభూతి నిజంగా అపూర్వమైనదే. ఈ రాజరాజేశ్వరుల సహకారం అంతటితో ఆగిపోలేదు. సుశీలతో పాడిన మిస్సమ్మ(1955) చిత్రంలోని ‘బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే’ ఒక మరపు రాని పాట. ఈ పాట ఎంత బాగుంటే కదా హిందీ ‘మిస్ మేరీ’ లో ఈ పాట వరుసను మాత్రమే హేమంతకుమార్ అలాగే ఏ మార్పు చేయకుండా ఉంచుకొన్నారు. బంగారు పాప(1954), భాగ్యరేఖ(1957) చిత్రాలలో రాజా పాడిన పాటలు కూడా తీపి గుర్తులే!

ఈ కాలంలో వచ్చిన పాటల్లో తప్పకుండా ఉదహరింపవలసినవి: ‘నేనూ ఒక మనిషినా’ (మేలుకొలుపు, 1956, పెండ్యాల, శ్రీశ్రీ-తాపీ), ‘అందాల రాణీ’ (ఆర్. బాలసరస్వతితో; వీరకంకణం, 1957, సుసర్ల, ఆరుద్ర), ‘తానేమి తలంచేనో’ (ఆర్. బాలసరస్వతితో; దాంపత్యం, 1957, రమేశ్ నాయుడు, ఆరుద్ర), ‘ప్రభూ తొలిసంజ’ (సిపాయి కూతురు, 1959, ఎం. సుబ్రహ్మణ్యరాజు, మల్లాది). ఇలా 1953-57 మధ్య కాలంలో రాజా నక్షత్రంలా ఒక వెలుగు వెలిగారు. ముఖ్యంగా ఒక రెండు సంవత్సరాల పాటు (1953-55) ఘంటసాల కంటే రాజా గాత్రానికే నిర్మాతలు, సంగీత దర్శకులు ప్రాధాన్యతనిచ్చారు.

నేపథ్యగానం పుంజుకోవడం, రామారావు, నాగేశ్వరరావులు ప్రముఖ నాయక పాత్రధారులుగా నిలదొక్కుకొనడం దాదాపు ఒకేసారి (1950-51 ప్రాంతం) జరిగాయి. ఘంటసాల కంఠంతో వారిద్దరి పాత్రలు పెనవేసుకుపోవడం అదే కాలంలో జరిగింది. 1953-57 మధ్యకాలంలో వారిద్దరికీ రాజా పాడిన పాటలు కొన్ని బహు ప్రశంసలు పొందినా ఆ తరువాత ఆ నాయకులకు పాడే అవకాశం ఆయనకు దొరకలేదు. మన చిత్ర నాయకులు ఎన్నడూ ధీరోదాత్తులు కాబట్టి దానికి తగ్గట్లు కంఠదారుఢ్యం లేక రాజా గొంతు పేలవంగా వుండేదని ఒక విమర్శ లేకపోలేదు. ఇలా రాజా కొంతవరకు నష్టపోయారు.

తొలినుండి రాజాకు స్వంతంగా స్వరకల్పన చేయాలనే ఆశ ఉండేది. చివరకు ఆ ఆశ తెలుగు చిత్రం శోభ (1958) తో ఫలించింది. ఇది హిందీ చిత్రం ‘దులారి’కి (నౌషాద్ సంగీతం) అనుకరణ. అందులో జిక్కీతో పాడిన యుగళగీతం ‘అందాల చిందు తారా’ ((హిందీలో లత, రఫీ పాడిన మిల్‌మిల్‌కే గాయేంగే దో దిల్ యహా అన్న పాటకు అనుసరణ) బాగా ప్రజాదరణ పొందింది. ఆ సినిమా బాగా ఆడకపోవడంతో పాటలూ మరుగున పడ్డాయి. కానీ రాజాను ఒక గొప్ప దర్శకునిగా రూపొందించినది తమిళ చిత్రం ‘కల్యాణ పరిశు’ (తెలుగులో పెళ్లి కానుక, 1960). దీని వెనుక ఒక చిన్న కథ కూడ ఉంది.

1950వ దశకంలో తమిrళ చిత్రరంగంలో శ్రీధర్ చిత్రకథ, సంభాషణల రచనలో గొప్ప పేరు సంపాదించారు. అన్నపూర్ణావారి తెలుగు చిత్రాల తమిళ ప్రతులకు వీరు మాటలను రాశారు. శ్రీధర్ చిత్రకథ, సంభాషణలు రాసిన మొదటి చిత్రం ‘ఎదిర్ పారాదదు’ (ఎదురు చూడనిది; ఈ చిత్రానికి తెలుగు ఇలవేలుపు చిత్రానికి పోలికలు ఉన్నాయి.). రాజా ఇందులో పాడిన ‘శిర్పి చెదుక్కాద పొర్చిలైయే’ (శిల్పి చెక్కని స్వర్ణ ప్రతిమా) చాలా ప్రసిద్ధమైన పాట. శ్రీధర్‌కు తాను స్వతంత్రంగా దర్శకుడు కావాలనే కోరిక ఉండేది. ఒకసారి కలిసి రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రీధర్ తన మొదటి సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకుంటానని రాజాకి మాటిచ్చాడు. ఆ అవకాశం ‘కల్యాణపరిశు’తో కలిసి వచ్చింది.

కొత్తవిధమైన కథ, వ్యావహారిక భాషలో మాటలు, కొత్త నటి (సరోజా దేవి), రాజా స్వరపరిచిన మధుర గీతాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. ఈ సినిమా ఇప్పటికీ తమిళ ప్రజల మనసుల్లో ముద్రవేసికొని ఉంది. దీపావళి పండుగ సమయంలో ఇందులోని ‘ఆడే పాడే పసివాడా’ అనే పాట ఇప్పటికీ వినబడుతూనే ఉంటుంది. ఈ చిత్రంలో రాజాకు అసిస్టెంటుగా పని చేసిన సెబాస్టియన్ డిసూజా (2006లో ఈయనకు శతజయంతి జరిగింది. పాశ్చాత్య సంగీతంలో ప్రసిద్ధికెక్కిన కౌంటర్ మెలోడీని(Counter-melody) చిత్రగీతాలలో ప్రవేశపెట్టిన ఒక గొప్ప అరేంజర్ వీరు) శంకర్-జైకిషన్ వంటి ప్రసిద్ధ సంగీత దర్శకులకు కూడా సహదర్శకుడే. అన్నీ ఒకటై కూడి ‘కల్యాణపరిశు’, దాని తెలుగు అనుకరణ ‘పెళ్లికానుక’ పాటలు ఒక కొత్త దారిని చూపించాయి.

భార్య అయిన జిక్కీ కంటే రాజా చిత్రాలలో ఎక్కువగా సుశీల పాడారు. అలా అని జిక్కీ పాటల మాధుర్యం తక్కువేమీ కాదు. రాజా దర్శకత్వంలో బహుశా జిక్కి పాడిన అత్యుత్తమమైన పాట ‘తుళ్ళాద మనముం తుళ్ళుం’ (తెలుగులో ‘పులకించని మది పులకించె’). పెళ్లికానుక సినిమాలో మిగిలిన అన్ని పాటలూ ‘కల్యాణ పరిశు’ మెట్టులోనే ఉన్నా ‘కన్నులతో పలుకరించు వలపులు’ మాత్రం కొత్తది. దీనికి కారణం తమిళంలోని ‘ఆశయినాలే మనం’ అనే పాట, పాండురంగ మాహాత్మ్యములోని ‘వన్నెల చిన్నెల నేరా’ అనే పాట పల్లవుల ఆధారం. మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాజాను 1959లో అత్యుత్తమ సంగీత దర్శకునిగా గౌరవించింది.

‘పెళ్లి కానుక’ విడుదలతో రాజాకు మరిన్ని అవకాశాలు రాసాగాయి. జెమినీ గణేశన్ గొంతుకు రాజా ఒక అద్దం అయ్యారు. తరువాత శ్రీధర్ దర్శకత్వంలో శివాజీ గణేశన్ చిత్రమైన ‘విడివెళ్ళి’కి (శుక్రతార) రాజా సంగీతాన్ని నిర్దేశించారు. తన స్వంత చిత్రంలో శివాజీ గణేశన్ సౌందరరాజన్‌ను కాక రాజాను పాడమన్నాడు. శ్రీధర్ దర్శకుడైన మరొక చిత్రం ‘మీండ శొర్గం’ (మరలి వచ్చిన స్వర్గము, తెలుగులో ‘స్త్రీ జీవితం’గా 1959లో విడుదలైంది). దీనికి సంగీత దర్శకుడు చలపతి రావు. ఇందులోని ‘కలైయే ఎన్ వాళ్కైయిన్ దిశై మాట్రినాయ్’ అనే పాట రాజాకు అపారమైన కీర్తిని తెచ్చి పెట్టింది. వైజయంతీమాల, జెమినీ గణేశన్‌లతో శ్రీధర్ కాశ్మీర్‌లో షూట్ చేసిన ‘తేన్ నిలవు’కి (1960, తెలుగులో “విరిసిన వెన్నెల”గా డబ్బింగు చేయబడింది) కూడా సంగీత దర్శకుడు రాజాయే. ఇందులోని హంసానంది రాగంలో ‘కాలైయుం నీయే మాలైయుం నీయే’ అనే పాట, సుశీలతో పాడిన యుగళగీతం ‘నిలవుం, మలరుం’ చక్కనైన పాటలు. ఈనాడు కూడా తమిళనాడులో ఈ చిత్రంలో నటించిన జెమినీ గణేశన్‌ను, పాటలను పాడిన రాజాను పదేపదే తలచుకొంటారు.

ఒక కోణంనుండి చూస్తే ఈ చిత్రం అతని జీవితానికి పెద్ద అడ్డంకిని కూడా కలిగించింది. ఎందుకో కానీ ఈ చిత్రపు రీరికార్డింగు (నేపథ్య సంగీతం) విషయంలో రాజా ఆలస్యం చేశారట. దానితో శ్రీధర్ ఈ చిత్రాన్ని సమయానికి విడుదల చేయలేక పోయారట. ఎం. జీ. రామచంద్రన్ మధ్యవర్తిత్వం చేసి రాజాచే పని పూర్తి చేయించారట. ఐనా కూడా శ్రీధర్ ‘నెంజిల్ ఒరు ఆలయం’ (తెలుగులో ‘మనసే మందిరం’) చిత్రానికి రాజానే సంగీత దర్శకుడుగా ఎన్నుకొన్నారట. మరెందుకో రాజా అంగీకరించలేదు. దీనితో ఆయన పతనం ప్రారంభమయింది.

రాజాతో మెలగడం కొద్దిగా కష్టమని వినికిడి. తాను కూర్చిన స్వరాలను ఎవరైనా దొంగిలిస్తారానే అపోహ ఉండేదట. ఏది ఏమైనా రాజా మార్కెట్ దిగజారింది. తెలుగు చిత్రసీమలో నాగేశ్వరరావు, ఎన్. టీ రామారావుల పాటలను ఘంటసాల గొంతుతో తప్ప మిగిలినవారి గళముతో వినడానికి ప్రజలు ఇష్టపడలేదు. ముఖ్యంగా ఆ కాలపు ఇద్దరు హీరోలకు ఎక్కువగా పాటలు ఘంటసాల పాడారు. ఘంటసాల, రాజాలు ఇద్దరు ఒకే చిత్రంలో పాడినా, ఘంటసాల సంగీత దర్శకత్వంలో రాజా ఎప్పుడూ పాడలేదు, కాని రాజా దర్శకత్వంలో ఘంటసాల (శొభ చిత్రానికి) పాడారు. తమిళములో పీ. బీ. శ్రీనివాస్ అదే సమయంలో ప్రవేశించారు. కొందరు దర్శకులు రాజాకు బదులు అతనిచేత పాడించారు. మరొకటి, సంగీత దర్శకుడైన తరువాత మిగిలిన సంగీత దర్శకులు అతనిచే పాడించడానికి కొద్దిగా సందేహించారేమో, తెలియదు. ఈ సంఘటనలు రాజాను మాత్రమే కాదు, అతని భార్య జిక్కిని కూడా తాకాయి. మెల్లమెల్లగా సినిమా రంగంనుండి నిష్క్రమించి తన పాటలను సభలలో, కార్యక్రమాలలో భార్యతో కూడా పాడసాగారు (ఆ కాలంలో అతని ఆర్కెస్ట్రాలో మరొక రాజా గిటార్ వాయించేవాడు. అతనే ఇప్పటి ఇళయరాజా. ఈయన చాలా యేళ్ల తరువాత 1990లలో జిక్కిచే మళ్ళీ పాడించారు). అదీ కాక రాజా తాను సంపాదించే కాలంలో కొన్ని టాక్సీలను కొని నడిపించే వారు. కాబట్టి జీవితం గడవడానికి కష్టమేమీ లేకపోయింది.

రాజా గాయకుడు దర్శకుడు మాత్రమే కాదు, ఒక నటుడు కూడా. ‘పక్కింటి అమ్మాయి’ (1953) చిత్రంలో రాజా నటనను అందరూ మెచ్చుకొన్నారు. ఇందులో ఒక విచిత్రమేమంటే, ఇదే పాత్రను హిందీ చిత్రంలో (పడోసన్, 1968) గాయక దర్శకుడు కిశోర్ కుమార్ వేయగా, మళ్లీ తీసిన (1976) తెలుగు చిత్రంలో ఈనాటి గాయక దర్శకుడు బాలసుబ్రహ్మణ్యం పోషించారు. ఇంత ఆదరణ పొందిన ఈ చిత్రానికి ‘పాషేర్ బారీ’ అనే బెంగాలీ నాటకం (సినిమాగా 1952లో) మాతృక. రాజా తెలుగు, తమిళ చిత్రాలలో మాత్రమే కాక మలయాళం, కన్నడ, హిందీ, సింహళ చిత్రాలలో కూడా పాడారు. మలయాళ సినీ రంగంలో హీరో సత్యన్‌కు గాత్రదానం ఎక్కువగా చేసింది రాజాయే. మలయాళంలో రాజా సంగీత దర్శకత్వం కూడా చేశారు. 1987లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేపర్‌లోని ఒక ఇంటర్వ్యూలో రాజా ఇలా అన్నారట:

“నా పాటలను ప్రజలు ఇంకా ఆదరించి మెచ్చుకొంటున్నారనే విషయం నాకెంతో సంతోషం. నేను కూడా ఆ పాటలను స్టేజిపైన పాడుతూ జీవితాన్ని గడుపుతున్నాను. అందుకే సంగీత దర్శకుడునిగా నా జీవితంలో సంభవించిన ఒడిదుడుకులకు నాకేమీ విచారం లేదు. అంతా విధి లీల. కాని నేననుకొన్నది సాధించాను. అయినా కూడా ఇంకా బాగా చేయాలనే ఆశ పోలేదు. ‘కల్యాణపరిశు’, ‘తేన్ నిలవు’ పాటలకంటె ఇంక మంచి పాటలే కట్టగలను. ఏదేమైనా నేను సంతృప్తితోనే ఉన్నాను. సినిమాలలో పాటలు పాడాలనుకొన్నాను, పాడాను. మంచి సంగీత దర్శకుడు కావాలనుకొన్నాను, అయినాను. ఇది చాలు నాకు”.

ఆ తరువాత 1970 ప్రాంతంలో మళ్లీ రాజా ‘వీట్టు మాప్పిళ్ళై’ అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో రాజా, జిక్కీ కలిసి పాడిన ‘రాశి నల్ల రాశి’ అనే పాట ప్రజల మన్ననకు పాత్రమయింది. శంకర్-గణేశ్ దర్శకత్వంలో కూడా వీరు 1970లలో పాడారు. ఇదే సమయంలో తెలుగులో, ‘పుట్టినిల్లు మెట్టినిల్లు’ అనే చిత్రంలో కూడా ‘సిరిమల్లె సొగసు’ అనే పాటని సుశీలతో పాడారు. కానీ అప్పటికే శ్రోతల అభిరుచులు, చిత్ర గీతాలలో హంగులు మారాయి. ఫలితంగా రాజాకు ఆదరణ ఎక్కువగా లభించలేదు. కాని రాజా-జిక్కీలు దేశవిదేశాలలో తమ పాటల కచేరీలు చేస్తూనే వున్నారు. వాటికి ఆదరణ మాత్రం తగ్గలేదు. 1989 ఏప్రిల్ నెల ఏడవ తారీకు ఒక కచేరికి వెళ్ళుతున్నప్పుడు పరిగెత్తే రైలు ఎక్కుతున్నప్పుడు కాలు జారి పట్టాల కింద పడి రాజా మరణించారు. పెట్టె లోపలనుండి భార్య జిక్కీ ఇదంతా చూడడం ఆమె దురదృష్టం. ఈ సంవత్సరంలో ఏ. ఎం. రాజా 80వ జయంతి, 20వ వర్ధంతులను పునస్కరించుకుని ఆయనను జ్ఞాపకం చేసుకోవడమే ఈ వ్యాస రచనకు మాకు ప్రేరణ నిచ్చింది.

రాజా అన్ని భాషలలో చేర్చి సుమారు ఐదారు వందల పాటలు పాడి ఉంటారని అంచనా (తప్పక వేయికన్నా తక్కువ). వారు బహుశా తెలుగుతో కూడా మొత్తం ఇరవై లేక ముప్ఫై చిత్రాలకు సంగీత దర్శకత్వం చేసి ఉండవచ్చు. అతని సమకాలీన గాయకులు (ఘంటసాల, టీ. ఎం. సౌందరరాజన్, పీ. బీ. శ్రీనివాస్) వేల సంఖ్యలో పాడారు. సంగీత దర్శకత్వంలో కూడా ఇలాగే. రాసిలో తక్కువైనా వాసిలో ఏమాత్రమూ తక్కువ కానివి రాజా పాటలు. తెలుగులో ఘంటసాల ఆ కాలంలో అందరికన్న మిన్న. కాని తమిళ చిత్రసీమలో నాటికీ, నేటికీ రాజాయే అత్యుత్తమ గాయక-దర్శకుడు. రాజాను గురించి ప్రశంసలు తమిళ సినీపత్రికలలో ఇప్పటికి చదువుతుంటాం. ఈనాటికి కూడా తమిళంలో రాజా పాడిన పాటలు చాలా విరివిగా, సులువుగా దొరుకుతాయి. హెచ్.ఎం.వి/సరెగమ వారు తెలుగులో రెండు రాజా పాటల సంకలనాలను వెలువరిస్తే తమిళంలో విడుదల చేసినవి పదిహేను!

రాజా కంఠంలోని ప్రత్యేకతలు - మార్దవత, స్వరశుద్ధత. ప్రేమగీతాలను పాడడంలో అతని కతడే సాటి. మంద్ర స్వరాలను స్పష్ఠంగా శ్రుతి తప్పకుండా పాడేవారు. అతని సంగీత దర్శకత్వంలో ప్రాధాన్యత మెలడీకే.

ఎన్నో చిత్రాల్లో ప్రేమ గీతాలు పాడిన ఏ. ఎం. రాజా, జిక్కి జంట ఆ సంవత్సరమే తమ గాన బంధాన్ని శాశ్వత సంబంధంగా మార్చుకున్నాయి.

రాజా సంగీతం సమకూర్చిన ' కళ్యాణ పరిశు ' తమిళ చిత్రం, దాని తెలుగు రూపమైన ' పెళ్ళికానుక ' చిత్రాలకు అవార్డులతోబాటు ప్రేక్షకుల రివార్డులు కూడా భారీగానే లభించాయి.

పల్లవికీ చరణానికీ మధ్య అంతరాలలోని వాద్య సంగీతంలో కూడా ఈ మాధుర్యం కనిపిస్తుంది. ఇందులో ఎక్కువగా వేణువు, వాయులీనాలు ఉంటాయి. శోకమయ గీతాలలో గాత్రం లీనమయినా, స్పష్టత కనిపిస్తూనే ఉంటుంది. అనవసర ఉచ్ఛ్వాసనిశ్వాసాలు మనకు గోచరించవు. ఈ విశిష్టమైన గుణాలవల్లే రాజా పాటలు ఇప్పటికీ మన మనసుల్లో చోటు చేసుకున్నాయి. ఇకముందు తరాలలో కూడా ఇలానే నిలిచివుంటాయి.

సుమారు వివిధ భాషలలో పదివేల పాటలను పాడి, సుమారు వంద చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏ. ఎం. రాజా జీవితం విషాదాంతం. మదురైలో సంగీత కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తూ కదిలే రైలు ఎక్కబోయి ప్లాట్ ఫారం మీదనుండి జారిపోయి రైలుకి, ప్లాట్ ఫారం కి మధ్య ఇరుక్కుని చనిపోయారు.
ఎంత దూరమీ పయనం.... అంటూ మొదలుపెట్టిన ఆయన సంగీత ప్రయాణం ఈ సంఘటనతో ముగిసింది.

No comments:

Post a Comment